
ప్రాణం తీసిన ఈత సరదా
మంగపేట: స్నేహితుల దినో త్సవం విషాదం నింపింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన బూర్గుల రమేశ్, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అభిషేక్(22) ఉన్నారు. అభిషేక్ డిగ్రీ వరకు చదివి ఇంటివద్ద ఉంటూ తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన మిత్రులు కార్తీక్, రుత్విక్, దేవేందర్, మనీశ్, విశ్వతేజతో కలిసి సరదాగా గడిపేందుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని జబ్బోనిగూడెం సమీపంలోగల గౌరారంవాగు గుండురాళ్ల ప్రాంతానికి ఈతకు వెళ్లారు. వాగులో దిగి నీటిలో మునిగిపోయిన అభిషేక్ స్నేహితులకు కనిపించలేదు. ఆందోళనకు గురైన వారు గుంతల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. వెంటనే విషయాన్ని గ్రామస్తులు, కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఈతగాళ్లు వాగులో గాలించి అభిషేక్ మృతదేహాన్ని బయటకు తెచ్చారు. సంతోషంగా బయటకు వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వాగులో మునిగి యువకుడి మృతి
స్నేహితుల దినోత్సవంలో విషాదం