
చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
బీసీ రిజర్వేషన్లపై
మల్హర్: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోందించిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండలంలోని తాడిచర్ల సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డుపడుతుందని ఆరోపించారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కోసం కేబినెట్‌లో నిర్ణయించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపామని, కానీ గవర్నర్ నుంచి ఎలాంటి ఆమోదం లభించలేదన్నారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదంలో జాప్యానికి నిరసనగా 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అప్పుడు బీసీ రిజర్వేషన్ చట్టం చేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, తాడిచర్ల గ్రామానికి చెందిన దండు రమేశ్‌ను ఎన్‌ఆర్‌ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా నియమించడం దళితులకు దక్కిన గౌరవమని వెల్లడించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ మల్హల్‌రావు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మల్క సూర్యప్రకాశ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు