
వేగంగా ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, మహబూబాబాద్: పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. ఇళ్ల మంజూరు, ప్రొసీడింగ్, పనుల ప్రారంభంలో రాష్ట్రంలో మొదటి రెండు స్థానాల్లో ఖమ్మం, యాదాద్రిభువనగిరి జిల్లాలు ఉండగా.. తర్వాత స్థానంలో మానుకోట నిలిచింది. పనుల్లో వెనుకబడిన జిల్లాను ముందు వరుసకు తీసుకొచ్చిన కలెక్టర్, అధికారుల బృందాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు.
మందకొడిగా మొదలై..
ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,89,065 దరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 28,526.. మొత్తంగా 2,17,591దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండలాలు, గ్రామాల వారీగా విభజించి టీమ్ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా ఆధార్‌కార్డు, రేషన్ కార్డు నంబర్లు సరిచూసుకుంటూ.. సొంత స్థలం ఉందా.. ఇల్లు ఉందా.. ఉంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారా.. మొదలైన వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్కడే ఇంటి యజ మాని, ఇల్లు ఫొటో తీసి అప్‌లోడ్ చేశారు. ఆ దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల జాబితా తయారు చేశారు. అయితే ముందుగా విడుదల చేసిన జాబితాలో అర్హుల పేర్లు లేవని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా ఒక్క ఇందిరమ్మ ఇళ్ల కోసమే 30,116 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి జాబితాలో ఇంట స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇవ్వడం, రెండో జాబితాలో ఇల్లు, స్థలం లేకుండా ఉన్నవారికి, మూడో విడతలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరుగా విభజించారు. జిల్లాలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది.
పుంజుకున్న వేగం..
మొదట ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్ మందకొడిగా సాగింది. ఈక్రమంలో మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్యేలతోపాటు ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌ను ఆదేశించారు. ఈక్రమంలో ఇళ్ల నిర్మాణాల్లో ఎందుకు ఆలస్యం అవుతుందని కారణాలు తెలుసుకున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతోపాటు ప్రతీ మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. వీరు స్థానిక ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ.. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్టు అధికారి లేక ఇబ్బంది అవుతుందని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి పీడీని నియమించేలా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 10,651 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 9,720 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. ఇందులో 7,338 ఇళ్లు ప్రారంభించారు.
అందరి సహకారంతో ముందుకు..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతీరోజు సమావేశాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టును తీసుకోవడంతో వేగం పెరిగింది. ప్రజాప్రతినిదులు, ప్రత్యేకాధికారులు, మండల అధికారుల సహకారంతో ముందుకెళ్తున్నాం. మిగిలిని ఇళ్లు కూడా త్వరగా గ్రౌండింగ్ చేసి నిర్మాణాల్లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.
– వి. హనుమ, పీడీ, హౌసింగ్
జిల్లాలో వేగం పుంజుకున్న నిర్మాణాలు
నిత్యం ప్రత్యేకాధికారుల సందర్శన
గ్రౌండింగ్‌లో రాష్ట్రస్థాయిలో
మూడో స్థానం
జిల్లా బృందానికి స్టేట్ హౌసింగ్
డైరెక్టర్ అభినందనలు
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
మంజూరైన ఇళ్లు : 10,651
ప్రొసీడింగ్ అందజేసినవి : 9,720
ప్రొసీడింగ్ ఇవ్వాల్సినవి : 931
నిర్మాణాలు ప్రారంభించినవి : 7,338
బేస్‌మెంట్ లెవల్ : 2,986
రూప్ లెవల్ : 81
స్లాబ్ వేసినవి : 17
రాష్ట్రంలో మూడో స్థానం
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌లో ఖమ్మం, యాదా ద్రి భువనగిరి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా మానుకోట మూడో స్థానంలో నిలించింది. ఇందుకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ పేరిట కలెక్టర్ అద్వైత్‌కుమార్‌కు అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. గ్రౌండింగ్‌లో జిల్లాను ముందు వరుసలో నిలి పేందుకు చేసిన కృషి, టీం వర్క్ బాగుందని పే ర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి వందశాతం గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు.

వేగంగా ఇందిరమ్మ ఇళ్లు!

వేగంగా ఇందిరమ్మ ఇళ్లు!