
రైల్వే స్టేషన్‌లో కుక్కలు.. కోతులు
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో నిత్యం కోతులు, కుక్కలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కోతులు రైళ్లు వచ్చి వెళ్లే సమయాల్లో ప్రయాణికులపై దాడి చేస్తూ ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తున్నాయి. ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై కోతులు గుంపులుగా బైఠాయిస్తుండడంతో ప్రయాణికులు స్టేషన్‌లోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి స్టేషన్‌లో కుక్కలు, కోతుల సంచారాన్ని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నేటి నుంచి
విశ్వస్తన్య పోషణ వారం
మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటివారం విశ్వస్తన్య పోషణవారంగా నిర్వహిస్తున్నామని ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రాధాన్యత ఇవ్వండి–నిలకడైన మద్దతు–వ్యవస్థలను సృష్టించండి అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. తల్లిపాల ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
సంక్షేమ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డీపీఆర్వో కార్యాలయంలో సాంస్కృతిక సారథి కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీపీఆర్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో రాము, సాంస్కృతిక సారథి సభ్యులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెల్లికుదురు: మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు చేపట్టి, అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరా థోడ్ ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల వారీగా డెంగీ, మలేరియా ఇతర వ్యాధులపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్వవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రిలో సమయపాలన పాటించి రోగులకు సరైన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శారద, సీహెచ్‌ఓ శాంతమ్మ, సూపర్‌వైజర్లు వసంతకుమారి, షహీన్ సుల్తానా, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో డే స్కాలర్ ప్రవేశాల కోసం అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన ఉపసంచాలకులు గుగులోతు దేశీరాం నాయక్ గురువారం తెలిపారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు తీసుకొని, అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 12న కలెక్టరేట్‌లో ఉదయం 11గంటలకు లక్కీడ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. 1–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. పూర్తి వివరాలకు కొత్తగూడెం, మహబూబాబాద్ గిరిజన కార్యాలయాలను సంప్రదించాలన్నారు.

రైల్వే స్టేషన్‌లో కుక్కలు.. కోతులు

రైల్వే స్టేషన్‌లో కుక్కలు.. కోతులు