
అసలేం జరుగుతోంది?
అదనపు కలెక్టర్ సందర్శన
మరిపెడ తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి దరఖాస్తులను ఆయన పరిశీలించారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలైతే కలెక్టర్ లాగిన్‌కు నివేదించాలని సూచించారు. తహసీల్దార్ కృష్ణవేణి ద్వారా పలు విషయాలు తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడి భూ భారతి సమస్యలు పరిష్కరించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు.
మరిపెడ/మరిపెడ రూరల్: తహసీల్దార్ కార్యాలయాన్ని వరుసగా కలెక్టర్, అదనపు కలెక్టర్‌ల సందర్శనతో అసలు ఏం జరుగుతుందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కిందస్థాయి ఉద్యోగి (యూడీసీ) విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు.. తోటి ఉద్యోగుల వేతనాలు చేయడంలో చేతివాటం ప్రదర్శిస్తుందని సదరు ఉద్యోగిపై తహసీల్దార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తహసీల్దార్ కూడా భాభారతి రిజిస్ట్రేషన్‌లో కొందరు ఉద్యోగుల సహకారంతో అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఐదుగురు ఉద్యోగులపై యూడీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం పెండింగ్ పనులన్నీ పక్కకు పెట్టి చెప్పా పెట్టకుండా యూడీసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వరుసగా ఉన్నతాధికారులు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఏం జరిగిందనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. మరోసారి గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ సందర్శించి సదరు యూడీసీకి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. రైతులు, ప్రజల సమస్యలు పరిష్కారించాల్సిన తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అందినకాడికి దోచుకోవడమే కాక, ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడం ఏమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, అధికారులు మాత్రం ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు.
మరిపెడ తహసీల్‌లో అధికారుల సందర్శనతో ఉద్యోగుల భయాందోళన
ఓ యూడీసీకి షోకాజ్ నోటీస్
జారీ చేసినట్లు సమాచారం