
కృత్రిమ కొరత సృష్టించొద్దు
మహబూబాబాద్ రూరల్: రైతులకు పంటల సాగు కు సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్నామని, కృత్రిమకొరత సృష్టిస్తే చర్యలు తప్పవని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు హెచ్చరించారు. మహబూ బాబాద్ పట్టణంలోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ–పాస్ మిషన్ బ్యాలెన్స్ వివరాలు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. రైతులకు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల నిల్వలు, ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
నీరు నిల్వలేకుండా చూడాలి
గూడూరు: వర్షాల నేపథ్యంలో నాటు వేసిన వరి పొలం, కంకి దశలో ఉన్న మొక్కజొన్న పంటల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోడౌన్‌లో గురువారం యూరియా నిల్వల రిజిస్టర్లను పరిశీలించారు. రైతుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. అనంతరం అప్పరాజ్‌పల్లి, గోవిందాపురం గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి ఎండీ.అబ్దుల్‌మాలిక్‌తో కలిసి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. కంకి దశకు చేరుకుంటున్న మొక్కజొన్న చేలలో నీరు ఉండకుండా చూడాలని, లేకుంటే మొక్క పసుపు రంగులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ మనోజ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.