
విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ రూరల్: విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలోని పీహెచ్‌సీ, జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీహెచ్‌సీలోని రికార్డులు, సిబ్బంది హాజరు వివరాలు,క్షేత్రస్థాయిలో ఆరోగ్య సర్వే, నివేదికల రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సెంటర్ పరిధిలోని సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సర్వే నిర్వహించి, వారి వివరాలను సేకరించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఉ పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం ప్రతీ ఒక్కరికి మంచి భోజనం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారి సాగర్, హైస్కూల్ హెచ్‌ఎం ఉప్పలయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్