
సమర్థవంతంగా నేర పరిశోధనలు
మహబూబాబాద్ రూరల్: మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి రావడంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నేర పరిశోధనలు చేయడం సాధ్యమవుతుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌ను ఎస్పీ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు జిల్లాస్థాయిలో ప్రాంతీయ ప్రయోగశాల అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉండేవన్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ద్వారా నేర స్థలాలకు వెంటనే చేరుకుని, ఆధారాలను సేకరించడానికి వీలు ఉంటుందన్నారు. దర్యాప్తులో వేగం, కచ్చితత్వం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ సత్యనారాయణ, ఆర్‌ఐ భాస్కర్, ఫింగర్ ప్రింట్ ఎస్సై శివకుమార్ పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్