
కొత్త పీఆర్‌సీ అమలు చేయాలి
గార్ల: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని టీఎస్ టీటీఎఫ్ (తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ ఈరునాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం గార్లలో ఉపాధ్యాయులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు బదిలీతో కూడిన పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో పని చేస్తున్న పీఈటీలు, భాషాపండితుల పోస్టులు అప్‌గ్రేడ్ చేసి వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శివనాయక్, వీరు, వీరన్న, నాగేశ్వరరావు, శ్రీను, రూప్‌సింగ్, రాము, వీర, హచ్చా, రా మోజీ, చిన్న, బాసు, జుంకీలాల్, రమేశ్, మంగీలాల్, పద్మ, దేవిక తదితరులు పాల్గొన్నారు.
అంబులెన్స్ వాహనం తనిఖీ
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో 108, 102, పార్థివ వాహనాన్ని ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. అంబులెన్స్‌ల రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. 108కు ఫోన్ వచ్చిన వెంట నే సకాలంలో స్పందించాలని, అత్యవసర వైద్య సేవలు అందించాలన్నారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ బత్తిని మహేశ్, పైలెట్లు, ఈఎంటీలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్
స్పెషలాఫీసర్‌గా కె.శశాంక
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌కు 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
అర్చక సంఘం ప్రధాన కార్యదర్శిగా అభిలాష్ శర్మ
కురవి: ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక సంఘం జేఏసీ ప్రధాన కార్యదర్శిగా కురవి వీరభద్రస్వామి ఆలయ అర్చకుడు ఊటూరి అభిలాష్ శర్మను నియమించారు. ఈమేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మ, జిల్లా అధ్యక్షుడు పాతర్లపాటి నరేష్‌శర్మ ఆయనకు నియామకపత్రం అందజేశారు. అర్చకుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అభిలాష్ శర్మ అన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
మహబూబాబాద్ రూరల్/గార్ల: రైతులకు అధిక ధరలకు యూరియా విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్ డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని ఫర్టిలైజర్స్, సీడ్స్, ఎరువుల దుకాణాల్లో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు దుకాణాల్లోని స్టాకు వివరాలు, ఆన్‌లైన్ నమోదు, రిజిస్టర్లు, గోడౌన్లను తనిఖీ చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న ఎరువుల అమ్మకాలు చేపట్టని వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుత సీజన్‌కు అనుగుణంగా జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

కొత్త పీఆర్‌సీ అమలు చేయాలి

కొత్త పీఆర్‌సీ అమలు చేయాలి