కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాల్లో పని చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రామిశ్రా సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన గిరిజన దర్బార్(గ్రీవెన్స్)లో ఆమె మాట్లాడారు. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లోని పీహెచ్‌సీల్లో పని చేస్తున్న సిబ్బంది సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పీహెచ్‌సీ, సబ్ సెంటర్‌లలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్, తాగునీరు, వాహన సమస్యలను వైద్యాధికారులు పీఓ దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి నివేదికలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇందిర జలప్రభకు అటవీశాఖ అధికారులు సహకరించాలని పీఓ సూచించారు. గతంలో అటవీ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో పోడు చేసేందుకు యత్నిస్తున్నారని, సంబంధంలేని వివరాలతో హక్కు పత్రాలు ఉన్నాయని ఒత్తిడి చేస్తున్నట్లు అటవీశాఖ అఽధికారులు పీఓ దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించాలని ఆధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం వినతులు స్వీకరించి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి రెఫర్ చేశారు. కార్యక్రమంలో మూడు మండలాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.