
పిట్టల్లా రాలుతున్నారు..
– వివరాలు 8లోu
సాక్షి, మహబూబాబాద్: భానుడి ప్రతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిప్పులు కురిపించే ఎండలో తప్పని పరిస్థితిలో పనిచేస్తూ వడదెబ్బకు గురై జిల్లా వ్యాప్తంగా రైతులు, కూలీలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే జిల్లాలో పదిమందికి పైగా వడదెబ్బతో మృతి చెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైద్యారోగ్యశాఖ, మున్సిపాలిటీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సహాయక చర్యలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించకపోవడంతోనే మృతుల సంఖ్య పెరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదిమందికి పైగా మృతి
జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో అస్వస్థతకు గురై రెండునెలల్లోనే పదిమందికి పైగా మృతి చెందారు. ఏప్రిల్ 15వ తేదీనన కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన బాసాని మల్లమ్మ, గార్ల మండలం జీవంజిపల్లి గ్రామానికి చెందిన బాదంపూడి సులోచన వడదెబ్బతో మృతి చెందారు. 21వ తేదీన తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ప్రేమలత, 22వ తేదీన నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న ఎండలో ధాన్యం ఆరబోసే పనిచేస్తుండగా.. ఎండదెబ్బ తగిలి మృతి చెందాడు. 28వ తేదీన మహబూబాబాద్ పట్టణంలో పనికోసం వచ్చిన బీహర్ కూలీ తులసి మిశ్ర వడదెబ్బతో మృతి చెందారు. 29వ తేదీన బయ్యారం మండలం కస్తూరినగర్‌కు చెందిన కేలోత్ రంగ్య ఎండలో పనిచేస్తూ కుప్పకూపోగా.. చికిత్స అందించే లోపే మృతి చెందారు. మే 6వ తేదీన గార్ల మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన అక్కి పార్వతి వడదెబ్బతో మృతి చెందారు. నర్సింహులపేట మండల కేంద్రం ఫీల్డ్ అసిస్టెంట్ తూడి మానిక్యం ఈనెల 11వ తేదీన ఉపాధి కూలీలతో పనిచేయిస్తూ వడదెబ్బతగిలి అస్వస్థతకు గురికాగా.. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 12వ తేదీన పెద్దవంగర మండలం పోచంపల్లి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన గంట్ల శివారు సమ్మిద్ కుంట తండాకు చెందిన గుగులోత్ కిషన్ వడదెబ్బతో మరణించారు. 14న గార్ల మండలం కొత్త పోచారం గ్రామానికి చెందిన గజ్జి యాకమ్మ ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందారు. దీంతోపాటు వడదెబ్బకు గురై అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు న్నవారు సైతం అనేకమంది ఉన్నారు.
కానరాని సహాయక చర్యలు
వేసవి ఎండల నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో వసతులు లేకపోవడం, వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించకపోవడంతోనే అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఉపాధి హామీ పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలి. కానీ, జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో వసతులు లేవు. దీంతోపాటు కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతం తగ్గడంకోసం ఆరబోస్తున్న రైతులు రోజలు తరబడి ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరికొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు, తరలింపు ఆలస్యం కావడం వంటి కారణాలతో రైతులు రోజల తరబడి ఆయా కేంద్రాల్లో ఎండలోనే ఉంటూ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతజరుగుతున్నా.. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం, ప్రధాన కూడళ్ల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ, చలి వేంద్రాల ఏర్పాటు వంటి సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
వారం రోజులుగా జిల్లాలో
ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీల్లో..)
జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
ఇప్పటికే పది మందికి పైగా మృతి
నిప్పులు కురిసే ఎండలో తప్పని పని
ఉపాధి పని ప్రదేశాల్లో సౌకర్యాల లేమి
తేదీన కనిష్టం గరిష్టం
10 25 40
11 27 39
12 25 40
13 25 38
14 25 37
15 26 40
16 23 35
17 28 42

పిట్టల్లా రాలుతున్నారు..