
లండన్‌లో చదువుకున్నా.. మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్‌లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృదద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్‌దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్‌లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజి, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్‌కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేష్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్, బీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని
కాకతీయ 22వ వారసుడు
కమల్ చంద్ర భంజ్‌దేవ్
కోట, వేయిస్తంభాల గుడి,
భద్రకాళి ఆలయంలో పూజలు