
పుష్కరాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సేవలు
● రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి అరవింద్ కుమార్
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల్లో భక్తుల భద్రత, అత్యవసర సేవల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సేవలు వినియోగించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్, సరస్వతీమాతా విగ్రహం, భక్తులు పుష్కర స్నానాలు చేసే త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, దేవాలయం, బందోబస్తు ప్రణాళిక తదితర రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు కాళేశ్వరంలో జాతీయ, రాష్ట్ర విపత్తులు దళ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ ఒక టీం (34 మంది), ఎస్‌డీఆర్‌ఎఫ్ రెండు టీంల (66 మంది) సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి తక్షణమే సేవలు అందించేందుకు ఈ బలగాలను వివిధ ఘాట్‌ల వద్ద సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. భక్తులు భద్రతా నిబంధనలను పాటిస్తూ, అధికారుల సూచనల ప్రకారం పుష్కర స్నానాలు చేయాలని సూచించారు. భక్తులు ప్రమాద హెచ్చరికల సూచికలు దాటి నదిలోకి వెళ్లకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీకి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి కెవి. సతీశ్ కుమార్, తెలంగాణ రీజియన్ ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెండ్ దామోదర్ సింగ్,కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, దేవస్థానం ఈఓ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.