ఎవరెస్టు కన్నా ఎత్తయినవి ఆమె ఊహా శిఖరాలు. సిందూరంకన్నా ఎరుపెక్కినవి ఆమె హృదయ జ్వాలలు. తనువును మోస్తున్న నేలకు, ఊపిరిలూదిన గాలికీ.. స్వేచ్ఛావాయువుల్నిచ్చిన భరత భూమికి సేవ చేయాలన్నదే ఆ తల్లుల సంకల్పం. అందుకనుగుణంగా వారి బిడ్డల్ని తీర్చిదిద్దారు. నిలువెల్లా దేశభక్తిని నూరిపోశారు. దేశసేవ కోసం సైన్యంలోకి పంపించిన ఓరుగల్లు మాతృమూర్తులే ఒక సైన్యం. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా దేశ సేవకు బిడ్డలను పంపిన పలువురు తల్లులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి ..
స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి కోరిక మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది.
ఆశయానికి ‘అమ్మ’ అండ..
జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సిందూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నుదిటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు.