
సెలవులపై గందరగోళం!
మహబూబాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రకటించిన మేనెల సెలవులపై అధికారుల నుంచి స్పష్టత కరువైంది. దీంతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు గందరగోళానికి గురవుతున్నారు. కాగా, పలు అంగన్‌వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్లు వారి పోరాట ఫలితంగానే ప్రభుత్వం మేలో వేసవి సెలవులు ప్రకటించిందని సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేశారు. అయితే డీడబ్ల్యూఓ మాత్రం తమకు ప్రభుత్వ పరంగా సర్క్యులర్ రాలేదని చెబు తున్నారు. దానిపై స్పష్టత లేక కొంతమంది టీచర్లు జిల్లా సంక్షేమశాఖ కార్యాలయానికి ఫోన్ చేసి సెలవులపై ఆరా తీస్తున్నారని సిబ్బంది అంటున్నారు.
1,435 కేంద్రాలు..
జిల్లాలోని ఐదు ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్, గార్ల, కురవి మండలాలు, గూడూరు ప్రాజెక్ట్ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ, మానుకోట పరిధిలో బయ్యారం, కేసముద్రం, మానుకోట, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట మండలాలు ఉన్నాయి. తొర్రూరు ప్రాజెక్ట్ పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, పెద్దవంగర మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్ట్‌ల పరిధిలో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 3604మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 20,295మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. సొంత భవనాల్లో 339 కేంద్రాలు, అద్దె భవనాల్లో 452, అద్దె లేకుండా (ఫ్రీ రెటెండ్) భవనాల్లో 644 కేంద్రాలు కొనసాగుతున్నాయి.
పోషణ లోపంతో 1,490 మంది..
కేంద్రాల్లో ప్రతీ నెల 1నుంచి 5వ తేదీ వరకు వెయింగ్ మిషన్‌తో పిల్లల బరువు, ఎత్తు కొలవాలి. వివరాలను టీచర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్‌హెచ్‌టీఎస్ యాప్(న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ ), కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ్ ట్రాకర్ యాప్‌లో నమోదు చేయాలి. దీంతో పిల్లల ఆరోగ్య స్థితి తెలుస్తుంది. వారిలో తీవ్ర పోషణలోపం, అతి తీవ్ర లోపం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. కాగా జిల్లాలో గత నెల తీవ్ర పోషణ లోపంతో 1,281 మంది, అతి తీవ్ర పోషణలోపంతో 209 మంది ఉన్నట్లు గుర్తించారు.
చికిత్స విధానం ఇలా ..
తీవ్ర పోషణ, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను పీహెచ్‌సీకి తీసుకెళ్లి డాక్టర్‌కు చూపించి మందులు ఇిప్పిస్తారు. అతి తీవ్రత పోషణ లోపంతో ఇబ్బంది పడితే ఎన్‌ఆర్‌బీ(న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్)కు పంపిస్తారు. వరంగల్, ఖమ్మంలో ఒక్కో సెంటర్ చొప్పున ఉన్నాయి. అక్కడ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారు. పిల్లలతో పాటు వెళ్లే తల్లిదండ్రులకు ఉచిత భోజన వసతి కల్పి స్తారు. తల్లిదండ్రులకు రోజువారీగా ఎంత కూలీ వస్తుందో తెలుసుకుని, ఆ మొత్తం డబ్బులను ఇస్తారని అధికారులు తెలిపారు.
గందరగోళం..
సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్‌తో పాటు పలు యూనియన్ల ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా కేంద్రాలకు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని ఆందోళన చేశారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంపూర్ణ, స్నేహబిందు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లుగా సమావేశాలు నిర్వహించి తెలియజేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ యూనియన్ నాయకులు గత నెల 29న ములుగు జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట చేసిన ఆందోళన చేయగా.. మంత్రి సీతక్క స్పందించి సెలవులు ప్రకటించారని టీచర్లు, ఆయాలకు చెప్పారు. దీంతో సెలవులు ప్రకటించారని జిల్లా కేంద్రంలో ఈనెల 1న కొంత మంది కేంద్రాలను తెరువ లేదు. మళ్లీ కార్యాలయానికి ఫోన్ చేయగా సెలవులు ప్రకటించలేదని చెప్పడంతో తర్వాత కేంద్రాలను తెరిచారు. స్పష్టత రాకపోవడంతో పాత పద్ధతిలో నెలలో 15 రోజులు టీచర్, 15 రోజులు ఆయా పని చేయాల్సి వస్తోంది.
మూడు సంవత్సరాల లోపు
పిల్లలకు టీహెచ్‌ఆర్..
మూడు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే టేక్ హోమ్ రేషన్ (టీహెచ్‌ఆర్)కింద బాలామృతం, 16 గుడ్లు ఇస్తున్నారు. అయితే వేసవి సెలవులు ప్రకటిస్తే ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా టీహెచ్‌ఆర్ విధానం ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, ఇతరత్రా సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది.
సెలవులు ఇచ్చినా అందుబాటులో
ఉండాల్సిందే..
వార్షిక సర్వే, ఇంటింటి సందర్శన, ప్రీస్కూల్ పిల్లల నమోదు, డ్రాఅవుట్ అడ్మిషన్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. గర్బిణుల వివరాలు నమోదు తదితర పనులు చేయాల్సిందే. వేసవిలో 15 రోజుల సెలవుల వెసులుబాటు కల్పించినా అందుబాటులో ఉండాల్సిందే.
సెలవుల విషయంలో
సర్క్యులర్ రాలేదు..
మే నెల వేసవి సెలవుల విషయంలో ప్రభుత్వం నుంచి సర్క్యులర్ రాలేదు. కొంత మంది యూనియన్ నాయకురాళ్లు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని చెబుతున్నారు. కానీ, పాత పద్ధతిలోనే కేంద్రాల నిర్వహణ చేపట్టాలి. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించే పనిలో టీచర్లు నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో వివరాల నమోదు వేగవంతం చేస్తాం. పిల్లల్లో ఆసమస్య లేకుండా చేస్తాం.
–ధనమ్మ, డీడబ్ల్యూఓ
●
అంగన్‌వాడీల సెలవులపై క్లారిటీ కరువు
సర్క్యులర్ రాలేదంటున్న డీడబ్ల్యూఓ
జిల్లాలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు
కలెక్టర్ సమీక్ష
కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 1న కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ జిల్లా సంక్షేమశాఖ అధికారులతో పిల్లల్లో పోషణ లోపంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కాగా ఈనెల 2 నుంచి టీచర్లు ఆపనిలో నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో చాలా సీరియస్‌గా పని చేస్తున్నారు.