అక్రమార్కులపై చర్యలేవి..? | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై చర్యలేవి..?

May 29 2025 1:27 AM | Updated on May 29 2025 1:27 AM

అక్రమార్కులపై చర్యలేవి..?

అక్రమార్కులపై చర్యలేవి..?

టీజీఎన్పీడీసీఎల్‌లో సబ్‌ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు

హన్మకొండ : తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(టీజీ ఎన్పీడీసీఎల్‌) లో చేపట్టిన సబ్‌ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగినట్లు వాస్తవాలు వెలుగుచూశాయి. అయితే దీనిపై యాజమాన్యం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తోంది. ఫలితంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ తీరుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. అక్రమాలు జరిగినట్లు మూడు నెలల క్రితమే నిజాలు నిగ్గు తేలగా ఇప్పటి వరకూ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని కాపాడడంలో ఉన్న ఆంతర్యమేమిటని విద్యుత్‌ ఉద్యోగ వర్గాలతో పాటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

ఎన్నిక కోడ్‌ ఎత్తివేశాక 2018 డిసెంబర్‌లో పూర్వ సర్కిళ్ల వారీగా మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్‌ లెటర్‌ పంపారు. అయితే ఈ సమయంలో మరో 24 పోస్టులు తగ్గించారు. గతంలో కాల్‌ లెటర్‌ అందుకుని రెండోసారి కాల్‌లెటర్‌ అందని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా అంతకు ముందు కాల్‌లెటర్‌ జారీ చేసిన వారందరికీ తిరిగి జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అనర్హులతో కలిపి 427 మందికి కాల్‌లెటర్‌ పంపి పోస్టులు భర్తీ చేశారు.. అయితే ఇక్కడ కోర్టు ఆదేశాలతో కాల్‌ లెటర్‌ పొందిన 24 మంది అభ్యర్థులను పక్కన పెట్టారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. కాల్‌ లెటర్‌ అందుకుని ఉద్యోగాలు రాని అభ్యర్థులు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలనలో ఫిర్యాదు చేశారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం విచారణ చేపట్టింది. టీజీ పీఎస్‌సీ నుంచి ఒక అధికారి, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ నుంచి ఇద్దరు, టీజీ ఎన్పీడీసీఎల్‌ నుంచి ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి 24 పోస్టుల భర్తీలో అక్రమాలకు జరిగినట్లు గుర్తించారు. అర్హులు కాని వారు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించి విచారణ కమిటీ యాజమాన్యానికి నివేదిక అందించింది. ఈ నివేదిక మేరకు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి నోటీసు జారీ చేయగా వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు వీరికి అనుకూలంగా నిర్ణయం వెల్లడించడంతో వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అన్యాయం జరిగిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కీలక పోస్టులో ఏళ్ల తరబడి ఒకే అధికారి తిష్ట

టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియను ఇండస్ట్రీయల్‌ విభాగం నిర్వహిస్తుంది. ఈ విభాగంలో కంపెనీ ఏర్పాటు నుంచి కీలక పోస్టులో ఒకే అధికారి ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. ఈ అధికారిపై అనేక ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడడంలో ఆయనది అందెవేసిన చేయి అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఒకే పోస్టులో పని చేస్తుండడంతో ఏ సమయంలో ఎలా అక్రమాలకు పాల్పడొచ్చో ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని సమాచారం. దీంతో సబ్‌ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలకు తెరలేపారని ఉద్యోగవర్గాలు పేర్కొన్నాయి.

విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు

497 సబ్‌ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్‌..

టీజీ ఎన్పీడీసీఎల్‌లో 497 సబ్‌ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018, మే 24న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించారు. ఆగష్టు 31న ఫలితాలు ప్రకటించారు. పోస్టుకు ఒక్కరు చొప్పున మెరిట్‌ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సెప్టెంబర్‌లో పూర్వ సర్కిల్‌ వారీగా వేర్వేరు తేదీల్లో కాల్‌ లెటర్‌ పంపించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు 497 మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్‌ లెటర్‌ పంపారు. అంటే ఇక్కడ 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపేశారు.

అక్రమార్కులపై చర్య తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటి?

ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు వెలుగు చూసినా ఎలాంటి చర్య తీసుకోకపోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తే చర్యలు తీసుకునే యాజమాన్యం.. ఇంత పెద్ద అక్రమం జరిగినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్‌లో చేపట్టనున్న నియామకాలు పారదర్శకంగా జరుగుతాయా అనే సందేహాలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడింది ఇండస్ట్రీయల్‌ విభాగం అధికారులేనని స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలకు వెనుకంజ వేయడంపై యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఉద్యోగులతోపాటు నిరుద్యోగులు కోరుతున్నారు.

విచారణ ముగిసి మూడు నెలలైనా బాధ్యులపై చర్యలు శూన్యం

యాజమాన్యం వెనుకడుగు

వెనుక ఉన్న ఒత్తిళ్లేమిటి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement