మట్టికి ఆరోగ్య పరీక్షలు..
ఖిలా వరంగల్: ఖరీఫ్‌లో రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇది అనువైన సమయం. ప్రతీ ఏడాది భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రైతులకు ఈ అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న తెలిపారు.
భూమిలో ప్రధానంగా
17 నుంచి 18 పోషకాలు..
మట్టి (భూసార) పరీక్షలతో నేల ఆరోగ్యం కాపాడినట్లు అవుతుందని, భూమిలో ప్రధానంగా 17 నుంచి 18 పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టిలో నైట్రోజన్, పాస్పరస్ ముఖ్యమైన పోషకాలు. తర్వాత కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్( సీహెచ్‌ఓ) మైక్రోన్యూట్రెన్స్ (లఘు పోషకాలు) ప్రధానమని, ఇవన్నీ ఉంటే పంటల దిగుబడి అఽధికంగా వస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమిలో సహజ పోషకాలున్నా రైతులు అధిక దిగుబడులు కోసం ఇష్టారాజ్యంగా రసాయన ఎరువులు వాడడం వల్ల కొన్ని రోజులకు భూమి చౌడుగా మారి వినియోగంలోకి రాకుండా పోతుందని తెలిపారు.
మట్టిని ఎలా సేకరించాలి..
ఏటవాలు పొలంలో వర్షపు నీరు ప్రవహించి పోషకాలు ఒకే దగ్గరికి చేరుతాయి. ఈనేపథ్యంలో రైతులు ఎకరం పొలంలో 8 నుంచి 10 ప్రదేశాల్లో మట్టిని సేకరించాలి. వీ ఆకారంలో 15సెం. వరకు పారతో గుంతతీసి, అందులో పైపొర ఇంచు లోతుకు తవ్వి మట్టి తీయాలి. తడిలేకుండా ఆరబెట్టాలి. చతురాస్త్రా ఆకారంలో నాలుగు విభాగాలు చేయాలి. ఎదురెదురుగా ఉన్న మన్ను మాత్రమే తీసుకోవాలి. మిగతా రెండు భాగాలను తొలగించాలి. ఇలా కిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్లు లేకుండా చూసుకుని నీడలో ఆరనివ్వాలి. నమూనా కోసం పొలంలో మట్టిని తవ్వి సేకరించే సమయంలో గట్ల దగ్గర, పంట కా ల్వలోని మట్టి తీసుకోవద్దు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించొద్దు. ఆ తర్వాత ఆ మట్టిని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, ములుగు రోడ్డులోని వ్యవసాయ పరిశోధన భూసార పరీక్ష కేంద్రానికి తరలించాలి. నిపుణులు సర్వే నంబర్‌తో నమోదు చేసుకుని ప్రయోగశాలలో పరీక్షలు చేసి నివేదిక అందజేస్తారు.
ఉమ్మడి వరంగల్‌లోని పొలాల్లో జింక్ లోపం..
ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు వరంగల్ జిల్లాలోని పొలాల్లో ఎక్కువ జింక్ లోపమున్నట్లు తేలిందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పశువులు, గొర్రె ఎరువు పొలంలోని భూమిలో కలిసిపోయి ఎరువుగా మారడం వల్ల జింక్ ఉండేది. ఇప్పడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు రసాయన ఎరువులు వాడడంతో భూసారం తగిందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వెల్లడించారు.
ప్రయోజనాలు..
భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. సమస్యాత్మక భూములున్నా వాటి గురించి తెలుసుకుని వాటిని సవరించుకునే విధానాలు కూడా ఉపయోగించొచ్చు.
భూసారంతో అధిక దిగుబడులు
ఎరువుల వాడకంలో ఖర్చులు తగ్గుదల
సూక్ష్మ పోషకాల పరిమాణాన్ని
తెలుసుకోవచ్చు
మట్టి నమూనాను సేకరించే పద్ధతి
ప్రదర్శన
రైతులకు అవగాహన సదస్సులు
భూసార పరీక్షలు తప్పనిసరి
ఖరీఫ్‌లో అన్నదాత కచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. చెప్పిన విధంగా మట్టిని సేకరించి ల్యాబ్‌లో అందజేస్తే వారంలోపు నివేదిక ఇస్తారు. నివేదిక ప్రకారం పంటలకు ఎరువులు వేస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది.
–రవీందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి
మట్టి పరీక్షలపై
అవగాహన పెంచుకోవాలి
సాగుకు ముందే మట్టి నామూనా సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకోవడం వల్ల అధిక దిగుబడులతోపాటు రసాయనిక ఎరువులు వాడకంలో ఖర్చులు తగ్గుతాయి. మట్టిపరీక్షలపై అవగాహన పెంచుకోవాలి.
–డాక్టర్ రాజన్న, కేవీకే కోఆర్డినేటర్,
మామునూరు
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
మట్టికి ఆరోగ్య పరీక్షలు..


