రాజీపడితే శాంతియుత జీవనం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : ఇరుపక్షాలు కోర్టు కేసుల్లో రాజీపడి శాంతియుత జీవనం గడపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ఆదివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఉత్తమమైన రాజీ మార్గాన్ని విడనాడితే ఎటువంటి దుష్పరిణామాలు కలుగుతాయో రామాయణ, మహాభారతాలు వివరించాయన్నారు. పాండవులకు కేవలం ఐదు ఊర్లు ఇచ్చి రాజీపడితే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి ఉండేదికాదని, దాని ఫలితమే కౌరవుల పతనానికి దారితీసిందని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని వివరిస్తూ హనుమంతుడి రాయభారాన్ని అంగీకరించి ఉంటే రామాయణ యుద్ధం జరిగేది కాదని, ఫలితమే లంకాదహనమని పేర్కొన్నారు. అందువల్ల వివాదాలు తలెత్తితే ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పరిష్కరించుకుంటే చాలా పల్లెలు వివాదరహిత గ్రామాలుగా నిలిచిపోతాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు విడాకులు కాకుండా మిగతా అన్ని సివిల్ కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి సహకరిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులను జడ్జి అభినందించారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. మైనర్లకు వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని, అది చట్ట విరుద్ధమని హెచ్చరించారు. సరైన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాహనాలను నడపాలని సూచించారు. డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ.. గత నవంబర్ 15న జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని, అలాంటి సంప్రదాయాన్ని న్యాయాధికారుల సహకారంతో మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణ తేజ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, ప్రభుత్వ న్యా యవాది నగేష్ కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌చందర్, టౌన్, రూరల్, బయ్యా రం సీఐలు గట్ల మహేందర్ రెడ్డి, పి.సర్వ య్య, బి.రవికుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ జీనత్, న్యాయవాదులు, కక్షిదారులు, సీడీఓలు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
తొర్రూరు: పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ కోరారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని కోర్టులో జాతీయ లోక్ అదా లత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. చిన్న, చిన్న సమస్యలతో గొడవలు పడి కేసుల పాలై కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను సర్వ నాశనం చేసుకోవద్దన్నారు. పీపీ రేవతిదేవి, డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్, బార్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు.
3,399 కేసుల పరిష్కారం
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కోర్టు, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,389 కేసులను పరిష్కరించారు. జిల్లా కోర్టు పరిధిలో ఒక క్రిమినల్, ఒక చెక్ బౌన్స్ కేసు, 19 మోటారు వాహన ప్రమాద కేసులు పరిష్కరించగా.. బాధితులకు రూ.1.02 కోట్లు నష్టపరిహారంగా అందజేయాలని ఆదేశించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక కేసు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 83 సివిల్ కేసులు, 302 క్రిమినల్ కేసులు, రెండు చెక్క బౌన్స్ కేసులు, 12 మద్యపానం కేసులు, 9 వివాహ సంబంధిత కేసులు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 385 క్రిమినల్ కేసులు, నాలుగు చెక్ బౌన్స్ కేసులు, 13 మద్యపానం కేసులు, రెండు వివాహ సంబంధిత కేసులు, న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో 470 విద్యుత్, మోటార్ వాహన, సైబర్ కేసులు, ద్వితీయ శ్రేణి కోర్టులో 1,573 పెట్టీ కేసులు మొత్తంగా 2,887 కేసులు పరిష్కారం చేశారు. తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 512 క్రిమినల్ కేసులు, ఏడు ఇతర కేసులు పరిష్కరించారు.


