విద్యార్థులు.. గజగజ
● సంక్షేమ హాస్టళ్లలో చన్నీటి స్నానాలు
● చెడిపోయిన సోలార్ వాటర్ హీటర్లు
● పట్టించుకోని అధికారులు
మహబూబాబాద్ అర్బన్: అసలే డిసెంబర్ మాసం.. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. కాగా జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులా ల విద్యార్థులు ఉదయం గజగజ వణుకుతూ చన్నీటి స్నానాలు చేయాల్సి దుస్థితి నెలకొంది. సోలార్ వాటర్ హీటర్లు సరిగా పనిచేయకపోవడం, దుప్పట్లు, మంచాల కొరత, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తరచూ విద్యార్థులకు జలుబు, ఇతన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని పలు విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు.
జిల్లాలో గురుకులాలు ఇలా..
జిల్లాలో ఐదు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 2,676 మంది విద్యార్థులు, ఆరు ట్రైబల్ గురుకులాల్లో 3,269 మంది, 23 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 4,728 మంది, రెండు మినీ గురుకులాల్లో 265 మంది, ఆరు మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాల్లో 2,970 మంది, ఐదు మైనార్టీ గురుకులాల్లో 1,129 మంది, 8 మోడల్ స్కూల్ హాస్టళ్లలో బాలికలు 760 మంది, 16 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 3,391 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇంటిని మరిపించేలా వసతులు ఉన్నాయని అధికారులు, నాయకులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలో గీజర్లు, వాటర్ హీటర్లు పనిచేయకపోయినా.. వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస మరమ్మతులు కూడా చేయించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజగజ వణుకుతూ చన్నీటితో స్నానాలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొందరు విద్యార్థులు ఉదయం చలికి భయపడి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో స్నానం చేస్తున్నారు. ఇప్పటికై నా వేడినీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
చన్నీటితో స్నానాలు
చేయలేకపోతున్నాం..
రోజురోజుకూ చలి పెరుగుతుంది. ఉదయం 7గంటలకు గజగజ వణుకుతూ చన్నీటి స్నానం చేయాల్సి వస్తుంది. చలి ఎక్కువగా ఉన్న రోజు మధ్యాహ్నం, సాయంత్రం స్నానం చేస్తున్నాం. సార్లు మా స్నానాలకు వేడి నీళ్లు కల్పించాలని కోరుతున్నాం.
–అభిరామ్, ఎస్టీ హాస్టల్ విద్యార్థి, మానుకోట
విద్యార్థులు.. గజగజ
విద్యార్థులు.. గజగజ


