నేటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22న సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం నేపథ్యంలో రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, వార్డుసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మొదటి సమావేశం జరగనుందన్నారు. ఆ ప్రక్రియను ఎంపీడీఓలు, తహసీల్దార్లు స్వయంగా పర్యవేక్షిస్తారని, ఈమేరకు ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. ఈవిషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఎరువుల యాప్
ప్రారంభం వాయిదా
● జిల్లా వ్యవసాయ అధికారి
ఎం.విజయనిర్మల
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో పలు సాంకేతిక కారణాల వల్ల ఎరువుల యాప్ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడిందని జిల్లా వ్యవ సాయ అధికారి ఎం.విజయనిర్మల ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ జరగాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి పేర్కొన్నారన్నారు. నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమం సోమవారం 5 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి జిల్లాలో అమలు తేదీని తెలియజేస్తామని, ఆ తేదీ ప్రకటించే వరకు ఆయా మండలాల్లో అమలవుతున్న పాత పద్ధతిలోనే యథావిధిగా రైతులు యూరియా పొందాలని కోరారు.
నేడు జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ
మహబూబాబాద్: జిల్లాలో అధిక మాంస ఉత్పత్తి లక్ష్యంగా ఈనెల 22నుంచి 31వ తేదీ వరకు అన్ని మండలాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా పశువైద్య, సంవర్థకశాఖ అధి కారి కిరణ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నట్టల నివారణ మందు వేసినట్లయితే జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. నట్టల మందు లోపంతో పశువుల్లో విరోచనాలు, పొట్టలావు కావడం, పెరుగుదల లేకపోవడం, గొంతుదగ్గర వాపు రావడం, రక్తహీనతతో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతాయని అన్నారు. జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సొసైటీలకు పర్సన్
ఇన్‌చార్జ్‌ల నియామకం
మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని 19 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ రాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్, ధన్నసరి, మల్యాల సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.ప్రవీణ్, బయ్యారం, గార్ల, డోర్నకల్ సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్టార్ కె.శ్రీనుబాబు, మరిపెడ, నర్సింహులపేట సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.సుమలత, నెల్లికుదురు, కురవి సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జె.మోహనరావు, తొర్రూరు, ఎర్రబెల్లిగూడెం, శ్రీరామగిరి సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రమేశ్, పొగుళ్లుపల్లి, గూడూరు సొసైటీలకు సీనియర్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, కాంపల్లి, మన్నెగూడెం, గుండ్రాతిమడుగు సొసైటీలకు సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎండీ.యాకూబ్ అలీ పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి క్రీడలతో ఉజ్వల భవిష్యత్
నెల్లికుదురు: రాష్ట్ర స్థాయి క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర క్రీడల పరిశీలకులు పులయ్య, జి.శారద, కృష్ణమూర్తి క్రీడాకారులకు సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రాష్ట్రస్థాయి యోగా, తాంగ్‌తా, గట్కా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, దీంతో మానసిక ఉల్లాసంతో పాటు మేధస్సు పెంపొందుతుందన్నారు. ఈ క్రీడల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడల ఆర్గనైజర్ అయిలయ్య, ఫిజికల్ డైరెక్టర్ హిమామ్ తదితరులు పాల్గొన్నారు.


