
అధికారుల నిర్లక్ష్యం..
నెహ్రూసెంటర్: జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చి ఏడాది దాటినా ఫైల్ ముందుకు కదలడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. త్వరగా భర్తీ చేయాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.
ఏడాది క్రితం..
ఏడాది క్రితం ఎన్‌హెచ్‌ఎంలో 37 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయగా 1661 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల ఎదురుచూపుల అనంతరం గత ఏడాది నవంబర్‌లో మెరిట్ లిస్టు ప్రకటించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించారు. అదేరోజు 14 పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన 23 పోస్టులను వాయిదా వేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కాగా నాటి నుంచి ఫైల్ ముందుకు కదలకపోవడంతో అభ్యర్థుల్లో నిరాశ, ఆందోళన పెరిగింది. కాగా వాయిదా వేసిన ఉద్యోగాల భర్తీకి మార్చి 28న ఫైనల్ జాబితాను విడుదల చేశారు. ఆ రోజు నుంచి ఏప్రిల్ 30వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే భర్తీ ప్రక్రియకు మాత్రం మోక్షం కలగడం లేదు.
వాయిదా వేయడంలో ఆంతర్యమేంటి..
కొన్ని పోస్టులను భర్తీ చేసి మిగిలిన పోస్టులు వాయిదా వేయడంలో ఆతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెరిట్ లిస్టు ప్రకటించడం వాయిదా వేయడం పరిపాటిగా మారింది. కాగా కొంత మందిని రిక్రూట్ చేసి తమను ఎందుకు ఎంపిక చేయడంలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎంఎల్‌హెచ్‌పీ–10, ఎన్‌సీడీ స్టాఫ్‌నర్సు–10, ఎంహెచ్‌ఎన్ స్టాఫ్‌నర్సు–02 మొత్తం 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
త్వరలో భర్తీ చేస్తాం..
ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జరుగుతున్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల ఆదేశాల మేరకు భర్తీ చేస్తాం. అభ్యర్థులు ఆందోళణ చెందవద్దు. త్వరలోనే భర్తీకి సంబంధించిన సమాచారం అందజేస్తాం.
– రవిరాథోడ్, డీఎంహెచ్‌ఓ
వైద్యారోగ్యశాఖలో
ఉద్యోగాల భర్తీపై నీలినీడలు
ఏడాదవుతున్నా కదలని ఫైల్
అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు