కర్నూలు(సెంట్రల్): అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీ ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఉంటే అందుకు కారణాలను ప్రజలకు వివరించాలన్నారు. అర్జీల రీఓపెన్ శాతాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, గృహ నిర్మాణ శాఖ పీడీ చిరంజీవి, ఎస్‌డీసీలు అనురాధ, సునీత, శివప్రసాదరెడ్డి, రామసుబ్బయ్య పాల్గొన్నారు.
21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ జి.లాలెప్ప తెలిపారు. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ కాలేజీలో సోమవారం ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఈ పరీక్షలకు 25,819 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 57 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
లాసెట్ ఫలితాలు
విడుదల
కర్నూలు (సిటీ): న్యాయ విద్య ప్రవేశాల కోసం ఈనెల 4న ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో మూడు సంవత్సరాల న్యాయ విద్య అభ్యసించేందుకు కర్నూలు జిల్లాలో 628 మంది, నంద్యాల జిల్లాలో 385 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఐదు సంవత్సరాల న్యాయ విద్య ప్రవేశానికి కర్నూలు జిల్లాలో 66 మంది, నంద్యాల జిల్లాలో 33 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 5 సంవత్సరాల న్యాయ విద్య పరీక్షలో నంద్యాలలోని విద్యానగర్‌కు చెందిన కట్టుబడి మహమ్మద్ హర్షద్ 96 మార్కులతో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు, ఆదోని హవన్న పేటకు చెందిన టిల్ మహమ్మద్ రాజా 94 మార్కులతో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించారు.
ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి క్యాంపు కార్యాలయాన్ని పాండవగల్లు పెద్ద చెరువు సాధన కమిటీ నాయకులు ముట్టడించారు. కార్యాలయ తలుపునకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాధన కమిటీ కన్వీనర్ తాహేర్‌వలి మాట్లాడుతూ.. పెద్ద చెరువును తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే పరిష్కరించాలన్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బంగారంపై
రుణాల కోసం...
పత్తికొండ: పాసు పుస్తకంపై తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు ఇచ్చే సౌలభ్యం ఉండటంతో రైతులు భారీగా బ్యాంకులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయమే పత్తికొండ పట్టణంలోని స్టేట్‌బ్యాంక్‌కు పెద్ద ఎత్తున వచ్చారు. బ్యాంక్ సిబ్బంది వారిని క్యూ పద్ధతిలో లోపలకి పంపారు. పట్టాదారు పాసుబుక్‌లను తీసుకుని టోకెన్ విధానం ద్వారా లోపలకి పిలిచి రుణం మంజూరు చేశారు.


