బనగానపల్లె రూరల్ : సెల్‌ఫోన్ల దొంగలు పోలీసులకు చిక్కారు. విలువైన 30 ఫోన్లతో పాటు, సారా స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపారు. బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్‌కుమార్ శనివారం పట్టణంలోని స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన యశ్వంత్ అలియాస్ గుడ్డి ఏసు అనే వ్యక్తి వద్ద గత కొన్నేళ్ల నుంచి రమేష్, లక్ష్ముయ్య, నిఖిల్, చరణ్ అనే నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, తిరుపతి,విజయవాడ తదితర జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లను దొంగిలించి వాటిని యస్వంత్‌కు అప్పగించడమే వారి పని. ఇందుకుగాను యశ్వంత్ వారికి నెలకు రూ.20 వేల ప్రకారం వేతనంతో పాటు దొంగతనాల కోసం కారు ఇచ్చాడు. గత నెల 31వ తేదీన బనగానపల్లెలో రెండు సెల్ ఫోన్లు చోరీ చేసిన పై నిందితులు శనివారం ఉదయం బనగానపల్లె మీదుగా డోన్ వైపు కారులో వెళ్తున్నారు. యాగంటిపల్లె రహదారిలోని సాయిబాబా గుడి సమీపంలో ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, కల్పన ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగలు గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. గుర్తించిన పోలీసు లు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకోగా కారులో 30 సెల్ ఫోన్లు, సారా ఉంది. ఈ రెండింటితో పాటు కారును స్వాధీనం చేసుకొని విచారించగా సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్నట్లు దొంగలు అంగీకరించారు. పట్టుబడిన సెల్‌ఫోన్ల విలువ రూ. 6.50 లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు.


