వెల్దుర్తి: సూదేపల్లె గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. అటు వైపు పొలాలకు వెళ్లే రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ యుగంధర్, ఎస్‌ఐ నరేశ్, కర్నూలు రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. దాదాపు 65 ఏళ్లున్న వృద్ధుడి మృతదేహాన్ని మోకళ్ల వరకు మడిచి, పాత బెడ్‌సీట్లతో కట్టి, ప్లాస్టిక్ పట్టలో చుట్టి పడేసినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆధారాల కోసం చుట్టుప్రక్కల ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రానున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రయాణిస్తున్న రైలులోంచి విసిరి వేశారా, హత్య చేసి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ పడవేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. మృతదేహం వద్ద ఆధారాలేవీ లభించలేదని, ఆచూకీ తెలిసిన వారు 9121101118 నంబరులో తమను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.


