● దేవుడి మాన్యం భూముల్లో అక్రమ తవ్వకాలు ● మట్టి ట్రాక్టర్ల అతి వేగాన్నిప్రశ్నించినందుకు హత్యకు కుట్ర ● ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించారని బాధితుడి ఆరోపణ
ఆత్మకూరురూరల్: వడ్ల రామాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు శేషిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గ్రామంలో పల్లెపాడు ఆంజనేయ స్వామి మాన్యం భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లింగస్వామికి చెందిన ట్రాక్టర్లు ఇందుకోసం వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ గ్రామంలో వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని డ్రైవర్లకు వేగం తగ్గించాలని చెప్పాలని సింగస్వామికి శేషిరెడ్డి చెప్పాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ తమ్మలూ రు ముర్తుజా వెంటనే శేషిరెడ్డికి ఫోన్ చేసి ‘మమ్మల్ని అడిగే వాడివా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ బెదిరించాడు. ఈ విషయంపై పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తుండటంతో శేషిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ముర్తుజా నేరుగా ట్రాక్టర్‌తో శేషిరెడ్డి ఇంటివద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు నిలుచున్న ఆయనను ట్రాక్టర్‌తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే చంద్రమౌళీశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కూడా తగిలేలా వెళ్లింది. వెంటనే వారు తేరుకుని ఇంట్లోకి పరిగెత్తారు. ట్రాక్టర్ శేషిరెడ్డి ఇంటి ప్రహరీని ఢీకొంది. శేషిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఈ హఠాత్పరిణామానికి బిత్తర పోయి తేరుకునేలోగా ముర్తుజా అక్కడ నుంచి ట్రాక్టర్‌తో పరారయ్యాడు. శేషిరెడి వెంటనే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు శేశాడు. ఈ మేరకు సీఐ మహేశ్వరరెడ్డి ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. పోలీసులు గాలించి ముర్తుజాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్రమ మైనింగ్‌ను పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని వడ్లరామాపురం గ్రామస్తులు కోరుతున్నారు.
చంపాలనే ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు
గ్రామంలో ఇష్టారాజ్యంగా వెళ్తున్న ట్రాక్టర్లను కాస్త నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే నన్ను చంపాలనే ట్రాక్టర్‌తో ఢీ కొట్టారు. ముర్తుజా నన్ను చంపుతానని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. ఇంట్లోకి పరిగెత్తడంతో ప్రాణాలు దక్కాయి. ముర్తుజాపై తగిన చర్యలు తీసుకోవాలి. దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు ఆపాలి. – శేషిరెడ్డి, బాధితుడు


