● వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ
సమన్వయకర్త బుట్టారేణుక
ఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని ఆప్కోలో ప్రభుత్వం విలీనం చేసేందుకు ప్రయత్నించడం తగదని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత కార్మికుల కోసం వీవర్స్ సహకార సొసైటీని పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించారన్నారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇలా చేస్తే కోట్లాది ఆస్తులున్న సొసైటీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చేనేత అంటే ఒక గుర్తింపు ఉన్న సొసైటీని అభివృద్ధి చేయాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది, సంఘంలో సభ్యుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సభ్యులకు ముడిసరుకులు ఇప్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం పెంచాలన్నారు. ఎమ్మిగనూరులో తయారయ్యే చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదన విరమించుకోకపోతే పార్టీలకు అతీతంగా పోరాడేందుకు చేనేత కార్మికులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేషప్ప, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు శివప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, చేనేత మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


