ఉమ్మడి కర్నూలు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కొత్తగా 600 కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇందులో యువకుల నుంచి వృద్ధుల వరకు ఉంటున్నారు. ఇటీవల కాలంలో యువత సంఖ్య విపరీతంగా గణనీయంగా అధికమవుతోంది. వీరిలో 30 శాతం వరకు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజీ విభాగంలో గత ఏడాది ఓపీ 7,942 మంది, ఇన్‌పేషంట్లుగా 1,892 మంది చికిత్స పొందగా, 3,190 మంది డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో పాటు నంద్యాల, ఆదోనిలలోనూ డయాలసిస్ కేంద్రాలు ఉన్నా యి. మొత్తం ప్రతి ఏటా 4వేల మందికి పైగా రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరందరూ డయాలసిస్ చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్‌లో ఉచితంగా ఆసుపత్రికి వచ్చి వెళ్లేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ సేవలు తీసేశారు. దీంతో డయాలసిస్ చేయించుకునేవారు బస్సులు, అద్దె వాహనాల్లో ఆసుపత్రులకు ఖర్చులు పెట్టుకుని రావాల్సి వస్తోంది. ఇందుకు గాను ఒక్కొక్కరికి ప్రయాణఖర్చులు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా అవుతోంది. బాధితుడితో పాటు సహాయకులు కూడా ఒకరు ఉండాల్సి రావడంతో ఆ రోజుకు వారు చేసే పని వదులుకోవడమో లేక సెలవుపై రావడమో చేయాల్సి వస్తోంది. ఈ రకంగా కూడా వారు నష్టపోతున్నారు.


