కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన జుబేదాబీ ఎన్నికయ్యారు. గురువారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి అన్ని మండల సమాఖ్యల నుంచి అధ్యక్షురాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా జుబేదా బీ, ఉపాధ్యక్షురాలుగా కె.మల్లేశ్వరి(కోడుమూరు), కార్యదర్శిగా బి.రాజేశ్వరి (ఆదోని), ఉప కార్యదర్శిగా గ్రేసమ్మ(మంత్రాలయం), కోశాధికారిగా జి.అరుణ(కర్నూలు) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి అభినందించారు.
బెట్టింగ్ అప్పు తీర్చేందుకు చైన్ స్నాచింగ్
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాలదిన్నెకు చెందిన చాకలి ప్రవీణ్ క్రికెట్ బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఇతడు కర్నూలు బాలాజీ నగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి వ్యాపారంలో వచ్చిన డబ్బంతా పోగొట్టుకుని అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. కర్నూలు శివారులోని బి.క్యాంప్ హౌసింగ్ బోర్డు కాలనీలో సిరిగిరి శ్యామలమ్మ అనే వృద్ధురాలు ఈనెల 10వ తేదీన ఇంటి ముందు మనవరాలిని ఆడిస్తుండగా మోటర్‌సైకిల్‌పై వచ్చి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పీఎస్ ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి బుధవారం మధ్యాహ్నం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని టీవీ టవర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. అతని నుంచి 30 గ్రాముల బంగారు పుస్తెల గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ శేషయ్య తెలిపారు.


