● రోడ్డు ప్రమాదంలో యువకుడి
దుర్మరణం
● ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో
ప్రమాదం
హాలహర్వి: అక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సరదాగా గడుపుదామనుకున్న ఆ యువకుడిపై మృత్యువు వల విసిరింది. రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడిని కబ ళించింది. హాలహర్వి నుంచి ఆలూరుకు వెళ్లే మార్గంలో బాట మారెమ్మవ్వ ఆలయ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన వడ్డె వెంకటేష్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీకి చెందిన వడ్డె వెంకటేష్ (19), శ్రీనివాసులు బళ్లారిలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం వెంకటేష్ అక్క పుట్టినరోజు కావడంతో వేడుకల్లో పాల్గొనేందుకు ఇద్దరూ బైకుపై బళ్లారి నుంచి ఆదోనికి బయలుదేరారు. బాట మారెమ్మవ్వ ఆలయ సమీపంలోకి రాగానే అగ్రహారం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ వీరి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాసులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ప్రమాద విషయం తెలుసుకున్న పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఎస్‌ఐ ఈశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.


