కర్నూలు(సెంట్రల్): ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌తో ఒరిగేదేమీ లేదంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతోష్‌కుమార్ హాజరై మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ హడావుడి చేయడం దారుణమన్నారు. మంత్రి లోకేష్ ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేయడం అన్యాయమని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల తడాఖా ఏమిటో తెలుస్తుందని హెచ్చరించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


