నకిలీ విత్తనాలతో నష్టపోయాం
● జిల్లా వ్యవసాయ అధికారిణికి
ఫిర్యాదు చేసిన రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన రైతులు దళారీలను నమ్మి మొక్కజొన్నలో విత్తనోత్పత్తి చేపట్టి నష్టపోయారు. శ్రీకర్ విత్తన కంపెనీ మొక్కజొన్న ఎఫ్/ఎస్ ఎంజెడ్–1011 రకం (బ్యాచ్ నెంబరు ఎస్‌ఎస్‌ఎంజెడ్ 1011223) విత్తనాలు దళారీల ద్వారా సరఫరా అయ్యాయి. ఈ విత్తనాలతో చంద్రశేఖర్, నారాయ ణ అనే రైతులు 2.70 ఎకరాల్లో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. విత్తనోత్పత్తిలో పెట్టుబడి వ్య యం ఎక్కువగా ఉంటుంది. దాదాపు రూ.1.50 లక్ష లు పెట్టుబడి పెట్టారు. పంట బాగా వస్తే క్వింటాలుకు రూ.3 వేల ప్రకారం కంపెనీ కొనుగోలు చేస్తుందని ఆశించారు. అయితే మూడు నెలలు గడచినప్పటికీ మొక్కల్లో పెరుగుదల లేకుండా పోయింది. ఒక్కో మొక్కకు రెండు అడుగులలోపు చిన్నచిన్న పిలకలు వచ్చాయి. పంట పూర్తిగా దెబ్బతినడంతో దళారీలు పత్తా లేకుండా పోయారు. కంపెనీ ప్రతినిధులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. గురువారం మొక్కజొన్న మొక్కలు తీసుకొని వచ్చి జిల్లా వ్యవసాయ అధికారిణి పీఎల్ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాలతో దెబ్బతీసిన కంపెనీపై చర్యలు తీసుకొని పరిహారం ఇప్పించాలని రైతులు కోరారు.


