మహనీయుడు.. ఖాదర్‌లింగ స్వామి
రేపు జయంతి వేడుకలు
కౌతాళం: తల్లి గర్భం నుంచే మహిమలు ప్రదర్శిస్తూ వేలాది మంది శిష్యులను కూడగట్టుకున్న గురువు ఖాదర్ లింగస్వామి. చరాచర జీవకోటి రాశులకే మూలమైన పరమేశ్వరుడినే మెప్పించిన ఓ ముస్లిం మహనీయుడు అని చరిత్ర చెబుతోంది. మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన ఖాదర్‌లింగ స్వామిని కులమతాలతీతకంగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఈనెల 20వ తేదీన ఖాదర్‌లింగ స్వామి జయంతిని దర్గా నిర్వాహకులు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులు తరలిరానున్నారు. పూర్వం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణంలో కొలువైన అమీనుద్దీన్ అలిఆలా షేర్ ఏ ఖుదా గురువు గారి వద్ద ఖాదర్‌లింగ స్వామి 12 సంవత్సరాలు శిష్యరికం చేశారు. గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో మత మౌఢ్యాన్ని తొలగించి మతసామరాస్యాన్ని చాటేందుకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాళానికి వచ్చారు. ఆయన మెడలో లింగాన్ని ధరించేవారు. దీనికి ఈ ప్రాంతంలో ఉన్న శైవమతస్తులు కొందరు అభ్యంతరం చెప్పారు. భగవంతుడు ఎవరి సొంతం కాదని పరమేశ్వరుని ప్రతీక అయిన లింగంపై ఎవరికీ హక్కు లేదని ఆయన వారితో వాదించారు. ఒకరోజు శైవమతస్తులను సమావేశ పరిచి వారి మేడలో ఉన్న లింగాలను బావిలో వేసి, వాటిని మరలా రప్పిస్తానని, అలా చేయలేని పక్షంలో గ్రామం వదలి వెళ్లడానికి సిద్ధమని, సాధించినచో తాను ప్రస్తుతం ఉన్న స్థలాన్ని శ్వాశతంగా ఉండడానికి ఇచ్చేయాలని ఒప్పందానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో ఆయన శివున్ని మోప్పించి లింగాలను బావి నుంచి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా మత సామరస్యంతో ఆయనను ఖాదర్‌లింగ స్వామిగా పూజించడం ఆరంభించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, ఐదుగురు కుమారులు 321 సంవత్సరాల క్రితం ఆయన గ్రామంలోనే సమాధి అయ్యారు. ఆయన వంశస్తులు అయిన ప్రస్తుత ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ట్రస్టీగా ఉన్నారు. ఖాదర్‌లింగ స్వామి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులు తరలిరానున్నారు.
మహనీయుడు.. ఖాదర్‌లింగ స్వామి


