ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ), ఏపీఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) డిమాండ్ చేశాయి. మంగళవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు రామకృష్ణ, ఆరీఫ్‌బాషా, గోపాల్‌రెడ్డి, ఖాజామొహిద్దీన్ మాట్లాడుతూ.. వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇ వ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్‌ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపు లు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌ను చేయించాలన్నారు. 2019 తరువాత ఉద్యోగంలో జాయిన్ అయిన వారిని పర్మినెంట్ చేయాలని, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని. ఉద్యోగుల జీతాలను డీఎల్‌ఎస్‌ఎఫ్ ప్రకారం చెల్లించాలని కోరారు. పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.


