పే రివిజన్ అమలు చేసిన వైఎస్ జగన్
ప్రభుత్వ నిర్లక్ష్యం
శేషజీవితం సేవలకు అంకితం
చంద్రబాబు ప్రభుత్వంలో అందని ప్రయోజనాలు
50శాతం మందికి పెన్షన్ ఇవ్వడంలో అలసత్వం
ఊసేలేని 10 నెలల వేతనం, గ్రాట్యూటీ
గత 18 నెలలుగా అందని అరియర్స్
మట్టి ఖర్చులకూ దిక్కులేని వైనం
నేడు పెన్షనర్ల దినోత్సవం
కర్నూలు(అగ్రికల్చర్): పదవీ విరమణ ఉద్యోగుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పదవీ విరమణ చేసిన వారిలో 50 శాతం మంది పెన్షన్‌కు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది. ఇక హెల్త్ కార్డులను తీసుకొని కార్పొరేట్, ప్రయివేటు అసుపత్రులకు వెళ్లిన పెన్షనర్లకు అంతులేని నిర్లక్ష్యం ఎదురవుతోంది. హెల్త్ కార్డులపై వైద్యం లేదని.. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలనే ఉచిత సలహాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా హెల్త్ కార్డులకు ప్రతి నెలా చెల్లిస్తున్న మొత్తం బూడిదలో పోసినట్లు అవుతోంది.
పదవీ విరమణ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం
ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే ఉద్యోగులు కర్నూ లు జిల్లాలో 25,985, నంద్యాల జిల్లాలో 20,282 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,287 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసే సమయానికే పెన్షన్ సహా ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ చెల్లించాల్సి ఉంది. అయితే 2024 జూన్ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్‌తో పాటు బెనిఫిట్స్ పొందడంలో చుక్కలు చూస్తున్నారు. 300 రోజుల (10 నెలల వేతనం) ఎర్న్ లీవ్‌లకు సంబంధించి పేమెంట్ చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. గ్రాట్యుటీ చెల్లించడంలోనూ చేతులెత్తేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2,650 విశ్రాంత ఉద్యోగులు ఎర్న్ లీవ్‌ల పేమెంట్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఆరు నెలలకోసారి కరువు భత్యం ఇవ్వడానికి రెగ్యులర్ ఉద్యోగులకు డీఏగా, విశ్రాంత ఉద్యోగులకు డీఆర్‌గా వ్యవహరిస్తారు. పెన్షనర్లకు చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో ఒక్క డీఆర్ మాత్రమే ఇచ్చింది. అరియర్ చెల్లించడంలో చుక్కలు చూపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా డీఆర్ అరియర్స్‌ను 4 విడతలుగా ఇచ్చే విధంగా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. నాలుగైదు నెలలుగా జీపీఎఫ్ పెండింగ్‌లో ఉండటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళనకు లోనవుతున్నారు.
నేడు పెన్షనర్ల దినోత్సవం
ప్రతి ఏటా డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చట్టబద్ధంగా పెన్షన్ చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని 1981 ప్రాంతంలో ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి డీఎస్ నకరా సుప్రీం కోర్టులో కేసు వేశారు. దీనిపై 1982లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. తీర్పు ఇచ్చిన రోజును పెన్షనర్ల దినోత్సవంగా 1983 నుంచి నిర్వహిస్తున్నారు.
జిల్లా వారీగా పెన్షనర్లు
2024 జూన్ తర్వాత పదవీ విరమణ చేసిన అనేక మందికి ఇంతవరకు పెన్షన్ కూడా అందడం లేదు. 10 నెలల వేతనం, గ్రాట్యుటీ చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. పే రివిజన్ కమిటీ ఏర్పాటులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.75 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని సత్కరిస్తాం.
– ఎస్.రంగారెడ్డి, ఏపీజీఆర్‌ఈఏ అధ్యక్షుడు
ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు మురారి శంకరప్ప. రెవెన్యూ డిపార్టుమెంట్‌లో తహసీల్దారు హోదాలో 2011లో పదవీ విరమణ పొందారు. అనంతరం అన్ని శాఖల విశ్రాంత ఉద్యోగులతో పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ఉంటూ ఏడాదికి రెండు, మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తిగతంగా దాదాపు ఏటా 200 మందికి ట్రెజరీ, ఏజీ ఆఫీసులు, సీసీఎల్‌ఏ కార్యాలయాల్లో సర్వీస్ మ్యాటర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో పాత దుస్తులు సేకరించి అనాథ పిల్లలకు పంపిణీ చేస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగుల పట్ల సర్కారు చిన్నచూపు
2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షనర్ల కోసం పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఈ కమిషన్ మార్కెట్ ధరలను అధ్యయనం చేసింది. విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించి సిఫారసులు చేసింది. పెన్షనర్లంటే నిర్లక్ష్య భావన ఉన్న చంద్రబాబు ఆ సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోలేదు. 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ సిఫారసులను అమలు చేశారు. ఇందువల్ల ఒక్కో పెన్షన్‌దారుకు వేల రూపాయల ప్రయోజనం లభించింది. తాజాగా పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కనీసం మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు కూడా పెన్షనర్లు నోచుకోని పరిస్థితి ఉంది. పెన్షనర్లు మరణిస్తే మట్టి ఖర్చులకు 24 గంటల్లో ట్రెజరీ అధికారులు రూ.25 వేలు చెల్లించేవారు. నేడు పెన్షనర్లు మరణిస్తే ట్రెజరీ అధికారులు మట్టి ఖర్చుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే విధానం అమలులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం మట్టి ఖర్చులకు ఇచ్చే ఆర్థిక సహాయం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
పే రివిజన్ అమలు చేసిన వైఎస్ జగన్
పే రివిజన్ అమలు చేసిన వైఎస్ జగన్
పే రివిజన్ అమలు చేసిన వైఎస్ జగన్


