వలసలే దిక్కు
రాష్ట్రంలో వ్యవసాయ రంగం దివాలా
ఉచిత పంటల బీమా అమలు చేయడం లేదు
చంద్రబాబు ప్రభుత్వంలో కర్షకులకు అన్నీ కష్టాలే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ రంగం దివాలా తీసిందని, రైతాంగాన్ని అదుకోవాలన్న డిమాండ్‌తో జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉద్యమం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ అధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతలు ఎప్పుడూ లేని కష్టాలు చూస్తున్నారన్నారు. ఉల్లి రైతులు ధర్నాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు, పొగాకు రైతుల వద్దకు వచ్చేంత వరకు సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉల్లికి అరకొరగా రూ.1,200 మద్దతు ధర ప్రకటించి రైతుల వద్ద 10 శాతం కూడా కొనలేదన్నారు. పత్తి, టమాట, అరటి ఇలా అన్ని పంటలకు గిట్టుబాటు ధరల్లేక, ప్రభుత్వం నుంచి మద్దతు ధరల్లేక రైతులు అప్పులపాలయ్యారన్నారు. ఎకరాకు రూ. లక్ష ఖర్చు చేసి ఉల్లిపంటను పండిస్తే చంద్రబాబు ప్రభుత్వం హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించి ఎంత మందికి ఇచ్చిందని ప్రశ్నించారు.
అరటి ధరలు దారుణంగా పడిపోయాయని, రైతుల వద్ద కిలో రూపాయి, రూపాయిన్నర్రకు కొనుగోలు చేస్తున్నారని, హెరిటేజ్‌లో మాత్రం ఒక్క అరటి పండు రూ.3 ప్రకారం అమ్ముతున్నారని ఎస్వీ అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రూ. 7,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీకి రూ. 3,862 కోట్లు, రైతుభరోసా కింద రూ.34,268 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పత్తి అధిక ధరలకు అమ్ముడుపోతే ఇప్పుడు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు మాత్రమే ఉందన్నారు. తేమ పేరుతో పత్తి రైతులను దగా చేస్తున్నారన్నారు. జగనన్న హయాంలో యూరియా కోసం రోడ్డెక్కిన చరిత్ర ఎక్కడైన ఉందా.. అని ప్రశ్నించారు. ఆర్‌బీకేల ద్వారా రైతుకు గత ప్రభుత్వం అండగా ఉంటే నేటి ప్రభుత్వంలో రైతులు బిచ్చగాళ్ల పరిస్థితికి రావడం చాలా బాధాకరమన్నారు.
ప్రతి ఏడాది అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఎస్వీ విమర్శించారు. ఇప్పటి వరకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రైతన్న మీ కోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారని దాని పేరును ‘ రైతన్నకు మోసం’ అని మార్చితే బాగుంటుందేమో అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పోలీసులు లేకుండా గ్రామాల్లో తిరగాలన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నా ప్రశ్నిస్తా అని చెప్పుకునే పవన్‌కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తుగా మారారన్నారు. రబీ సీజన్ నుంచి అయినా ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులు యాదవ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి,కిషన్, రాజశేఖర్ పాల్గొన్నారు.
చాలా బాధాకరం
రైతన్నకు మోసం!
వలసలే దిక్కు


