టీబీ డ్యాం గేట్ల ఏర్పాటుకు పూజలు
కర్నూలు సిటీ: టీబీ డ్యాం గేట్ల ఏర్పాటుకు శుక్రవారం టీబీ బోర్డు సెక్రటరీ ఓ.రామకృష్ణారెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్ పూజలు నిర్వహించారు. గతేడాది ఆగష్టు నెలలో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహనికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు స్థానంలో తాత్కలికంగా స్టాప్‌లాక్ గేటును ఏర్పాటు చేశారు. సీడబ్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఇచ్చిన సూచనలు ఆధారంగా కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్ అనే సంస్థతో స్టడీ చేయించారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డ్యాం 33 గేట్లు మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం డ్యాంలో 1621.98 అడుగులు, 67.05 టీఎంసీ నీరు ఉంది. ఈ నీటి మట్టం 1613 అడుగులకు చేరిన తరువాత సిద్ధంగా ఉంచిన 15 గేట్లను మార్చనున్నారు. ప్రస్తుతం గేట్లను 1621.98 అడుగుల వరకు ఎలిమెంట్స్‌ను తొలగించే పనులు ఒకటి, రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టనున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోని అర్బన్: కంటైనర్ ఢీకొనడంతో ఆస్పరి మండలం తురువగల్ గ్రామానికి చెందిన వెంకటేష్(38) అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందారు. తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేష్ తల్లి బజారమ్మ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆదోని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం భార్యను అమ్మ దగ్గర వదిలి తిరిగి తురువగల్లు గ్రామానికి వెంటకేష్ వెళ్తుండగా ఆస్పరి రోడ్డులో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పవిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


