దివ్యాంగులకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతులకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఈ నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతి భావంతుల (దివ్యాంగుల) దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పలు అవకాశాలను కల్పించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందిస్తున్న విధంగానే దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆయా విద్యా సంస్థల్లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.
రూ. 22 లక్షల విలువ చేసే విత్తనాలు సీజ్
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని రెండు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసి రూ. 22.22 లక్షల విలువ చేసే విత్తనాలను పట్టుకున్నట్లు ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి, ఏవో శివశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న శివకిరణ్ ట్రేడర్స్, గంజల్లరోడ్డులోని క్రాంతి ఆగ్రో ట్రేడర్స్‌లో అనధికారికంగా వరి, మొక్క జొన్న విత్తనాలు ఉన్నాయని సమాచారం రావటంతో ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి, ఏవో శివశంకర్లు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు దుకాణాల్లో మూడు రకాల పెన్నా సీడ్, కోర్ సీడ్ (మొక్కజొన్న), వరి (టీ స్టెయిన్స్) విత్తనాలు ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారని చెప్పారు. అనధికారికంగా ఉన్న విత్తనాలు సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వీటి విలువ రూ. 22,22, 2500 ఉంటుందని, 6ఏ కేసు నమోదు చేసి జిల్లా జాయింట్ కలెక్టరకు పంపనున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందిస్తామని పేర్కొన్నారు. తనిఖీల్లో ఏఈవోలు నరసింహులు తదితరులు ఉన్నారు.
అమరావతి అభివృద్ధి పేరుతో అప్పులా?
ఆలూరు: అమరావతిని అభివృద్ధి పేరుతో అప్పు చేయడం తగదని సీపీఎం జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు గఫూర్ అన్నారు. ఆలూరులో శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ స్వర్ణోత్సవాల ముగింపు మహాసభ నిర్వహించారు. సభలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి ఒక్కటే కనిపిస్తోందని, రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీటి సమస్యలు కనిపించడం లేదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రంగన్న, సీపీఎం నాయకులు హనుమంతు, నారాయణస్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


