పదకొండు నెలల్లో 8 వేల కేసులు...
జిల్లాలో రోజుకు సగటున చిన్నా, పెద్దవి కలసి ఐదు రహదారి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ప్రతి పది ప్రమాదాల్లో మూడింటికి మద్యం మత్తే కారణమని గణాంకాలను బట్టి తెలుస్తోంది. మద్యం మత్తు వల్ల ప్రమాదాలకు గురైతే బీమా పథకాలు వర్తించవని పోలీసులు సూచిస్తున్నారు. ఒకరు చేసే తప్పునకు వారి కుటుంబం మొత్తం బాధ పడటమే కాకుండా ఇతర వాహనదారులు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. రోడ్డు భద్రత, పోలీసు సూచనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణాలు సాధ్యం. ఈ ఏడాది జిల్లాలో పదకొండు నెలల్లో ఎనిమిది వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య తీవ్రత అర్థమవుతోంది.
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. మత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా చాలామంది దానిని పట్టించుకోవడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి జరిమానాల కొరఢా విధిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఎంతో మంది మృతి చెందుతున్నారు. జిల్లాలో గత మూడేళ్లలో 1,650 రోడ్డు ప్రమాదాలు జరగ్గా దాదాపు 870 మంది మృత్యువాత పడ్డారు. 1,861 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయి కుటుంబాలకు భారంగా జీవనం సాగిస్తున్నారు. అక్టోబర్ 24న చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటన మొదలు జిల్లాలో వరుసగా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 40 రోజుల వ్యవధిలో సుమారు 50 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందటం వాటి తీవ్రతకు అద్దం పడుతోంది.
మద్యం కేసులను
తీవ్రంగా పరిగణిస్తున్న కోర్టులు...
మద్యం తాగి వాహనాలు నడపటం నేరం. ఇలాంటి కేసులను కోర్టులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గతంలో బ్రీత్ ఎనలైజర్‌లో చూపించే లెక్క ఆధారంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలు జరిమానా పడేది. మోతాదుకు మించి ఉంటే జైలు శిక్ష విధించేవారు. అయినా మందుబాబుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో న్యాయ స్థానాలు భారీగా జరిమానా విధిస్తున్నాయి. కొంతకాలంగా కోర్టు మెట్లు ఎక్కిన ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు.
30 శాతం మత్తే కారణం
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారు. 25 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారు ఉంటున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. మద్యం తాగి స్పృహ లేకుండా వాహనాలు నడిపి ఇతరులను ప్రమాదాల్లో పడేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు డివైడర్లకు తగిలి పడిపోయినా... ఎదురెదురు వాహనాలు ఢీకొట్టుకున్నా... ఆగిన వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినా, ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి పడిపోయినా, పాదచారులపై దూసుకెళ్లినా... ఇలా చాలా ప్రమాదాల్లో మద్యం మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లలో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రతి నెలా పాతికమందికి పైగానే చనిపోతున్నారు.
80 పాయింట్లు దాటితే కేసే...
జాతీయ రహదారులతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడిన వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు నడిపిన వ్యక్తికి భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌లో 80 పాయింట్ల కంటే ఎక్కువ చూపితే వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారుల్లో తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య వాహనచోదకులకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు.
మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవడం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తనిఖీల సందర్భంగా సూచిస్తున్నా మార్పు కనిపించటం లేదు.
– మన్సూరుద్దీన్, ట్రాఫిక్ సీఐ
సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2023 509 298 568
2024 520 281 614
2025 621 291 679
అక్టోబర్ వరకు


