ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
కర్నూలు : ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హోంగార్డులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. డిసెంబర్ 6వ తేదీ హోంగార్డ్స్ 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని (రైజింగ్ డే) పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు 10 మంది డాక్టర్లు శిబిరంలో పాల్గొని హోంగార్డు కుటుంబాలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. జబ్బులు బయటపడిన వారు ఆరోగ్య భద్రత పథకం కింద మరోసారి వైద్యపరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని హోంగార్డు కుటుంబాలకు ఎస్పీ సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబు ప్రసాద్, ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతితో పాటు హోంగార్డు ఆర్‌ఐలు పోతల రాజు, జావిద్, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.


