లక్ష గృహాలకు ‘పీఎం సూర్యఘర్’
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు(సెంట్రల్): పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో లక్ష గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జెడ్పీ సీఈఓ, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గినట్లు వివరించాలని సూచించారు. గురువారం కలెక్టర్ తన చాంబరులో పీఎం సూర్య ఘర్‌కి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో పీఎం సూర్య ఘర్ కింద ఇప్పటి వరకు 92,469 మంది రిజిస్టర్ అయ్యారని, ఇందులో ఎస్సీ, ఎస్టీలు 81,591 మంది, ఇతరులు 10,878 మంది ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 23,077 గృహాలకు మార్చిలోపు రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పెద్దహరివాణం గ్రామంలో ఐదు రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఎపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఎల్‌డీఓం రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి..
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో పాలనా సౌలభ్యంలో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు డివిజినల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన నూతన డీఎల్‌డీఓ కార్యాలయాన్ని గురువారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డీపీఓ జీ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు తదితర అనేక సమస్యలు ఉంటాయన్నారు. వాటి పరిష్కారం కోసం డీఎల్‌డీఓ కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఆదోని డీఎల్‌డీఓ కార్యాలయాల్లో అధికారులు సమస్యలు పరిష్కరించాలన్నారు. డీఎల్‌డీఓ రమణారెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డితో పాటు ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు పాల్గొన్నారు.


