ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
● జేసీ కారును అడ్డుకున్న రైతులు
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తాము సాగుచేసుకున్న పంటలు మునిగిపోతున్నాయని, సమస్య పరిష్కరించాలని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?’ అంటూ జేసీ నూరుల్ ఖమర్ కారును అడ్డుకున్నారు. కారు ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు కారును వెళ్లనీయబోమని జేసీతో వాదనకు దిగారు. జీడీపీలో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచడంతో 200 ఎకరాల వరకు ఆయకట్టు భూమి నీట మునుగుతుందని చెప్పారు. ఈ ఏడాది వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, మొక్కజొన్న పంటలు 160 ఎకరాలలో నీటి మునిగి రూ.2కోట్ల మేర పంట నష్టం వచ్చిందన్నారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీ సామర్థ్యం పెంచడం కోసం భూములిచ్చి తాము ఎలా బతకాలని, సమస్యను పరిష్కరించకపోతే అత్మహత్యలే చేసుకుంటామని పలువురు రైతులు అన్నారు. భూమి నష్టపోయిన రైతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కొందరు కోరారు. ఇందుకు జేసీ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.


