బీసీ హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి
● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర
కార్యదర్శి కటారుకొండ సాయి కుమార్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 384 గ్రేడ్ –2 వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గ్రేడ్ –2 వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఒక్కో వార్డెన్ రెండు, మూడు హాస్టళ్లకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో విద్యార్థుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1110 బీసీ వసతి గృహాల్లో 743 బాలురు, 367 బాలికల వసతి గృహాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ హాస్టళ్లలో 50 శాతానికి మించి రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రేడ్ –2 వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడితే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.
వక్ఫ్ ఆస్తుల నమోదుకు నేడు ఆఖరు
కర్నూలు(అర్బన్): వక్ఫ్ భూములు, ఇతరత్రా ఆస్తుల వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమీద్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఎస్ సబీహా పర్వీన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఈ పోర్టల్‌లో ఈ నెల 5వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.
పని ఒత్తిడితో సచివాలయ ఉద్యోగి మృతి
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని ఇందిరానగర్ వార్డు సచివాలయ ఉద్యోగి రాజారత్నం(41) పని ఒత్తిడితో అనారోగ్యం పాలై గురువారం మృతి చెందాడు. వార్డు సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్, డెవలప్‌మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనకు అదనంగా వార్డ్ అడ్మిన్ సెక్రటరీగాను, బీఎల్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. ఆయా పనుల ఒత్తిడితో ఐదురోజుల క్రితం అనారోగ్యం పాలైయ్యాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయనకు మెరుగైన చికిత్స కోసం స్థానిక వార్డు సచివాలయ సిబ్బంది ఆర్థిక సాయం చేశారు. కర్నూలులోని ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తల్లి ఉసేనమ్మ, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
పాణ్యం: కర్నూలు నుంచి తిరుపతికి 24 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం 6గంటలకు బయలుదేరిన కర్నూల్–2 డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు వెనక చక్రం ఊడిపోయింది. దాదాపుగా 100మీటర్లు దూరం వెళ్లి ఓ హోటల్‌గోడను ఢీకొని కిందపడింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం వద్ద ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. చక్రం ఊడిపోయి వెళ్తున్న క్రమంలో బస్సు ఒక కూరగాయ బండిని, నాగరాజు అనే వ్యక్తిని ఢీకొనింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బీసీ హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి
బీసీ హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి


