ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో ఎర్రజెండాలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని, కమ్యూనిస్టులు రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఎదగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం సీఆర్ భవన్‌లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. నేపాల్‌లో 9 కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఒకే వేదికపైకి వచ్చినట్లు ఇక్కడ కూడా ఎర్రజెండాలన్నీ ఏకం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మావోయిస్టు నేతలు, సభ్యులను హత్య చేస్తోందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి పోరాటాలకు దిగాలన్నారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, చంద్రబాబు పాలనలో 4111 పాఠశాలలను మూసివేశారని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వేలాది టీచింగ్, నాన్ టీచించ్ పోస్టులను భర్తీ చేయడంలేదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేదలకు అందని ద్రాక్షగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. రూ.6400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు కాలేజీలు మానుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా నిరుద్యోగులకు భృతి లేదని, మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500 ఇవ్వడం లేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కేంద్రంతో అంటకాగుతున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు, పూర్వపు జిల్లా కార్యదర్శి పి.భీమలింగప్ప పాల్గొన్నారు.


