కోలుకోలేక రిటైర్డ్ ఉద్యోగి..
కర్నూలు: కర్నూలు శివారు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయకల్లు సుంకన్న (72) తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈయన కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని మంగళగిరి కాలనీలో నివాసముంటాడు. అగ్నిమాపక శాఖలో లీడ్ ఫైర్‌మెన్ (ఎల్‌ఎఫ్)గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. గురువారం మధ్యాహ్నం కర్నూలులోని టెలికాం నగర్ నందు ఉన్న వెంకటేశ్వర ఫర్నీచర్ షాపు వద్దకు వచ్చి కొత్త ఇంటికి తలుపులు, కిటికీలు బిగించుకునేందుకు కార్పెంటర్ కుమ్మరి మహేశ్వరాచారి స్కూటీ వెనుక కూర్చొని తాండ్రపాడుకు వెళ్లారు. చెక్క సామాన్లు కొలతలు తీసుకోవడానికి తిరిగి నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఉన్న సూర్య టింబర్ డిపో వద్దకు స్కూటీపై వస్తుండగా భారత్ పెట్రోల్ బంకు సమీపంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న మహేశ్వరాచారికి స్వల్ప గాయాలు కాగా, వెనుక కూర్చున్న సుంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించగా కోలుకోలేక తెల్లవారుజామున మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


