మా రోడ్డుపై టిప్పర్లు తిప్పితే ఊరుకోం
● గ్రావెల్ తరలింపును అడ్డుకున్న పూడూరువాసులు
కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని పూడూరు గ్రామస్తులు మరోసారి రోడ్డెక్కారు. ఇప్పటికే రెండు సార్లు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు.. రెండు రోజుల క్రితం మరోసారి గ్రావెల్ తరలిస్తుండడంతో మంగళవారం టిప్పర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాము ఎన్నో ఏళ్లుగా పోరాటం, ఆందోళనలు చేసి సాధించుకున్న రోడ్డుపై అధిక బరువుతో టిప్పర్లు తిరిగితే గుంతలు పడే అవకాశం ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి మట్టి తరలింపును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న తాలుకా పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు నిర్వహించడంతో గ్రామస్తులు శాంతించారు. మరోసారి భారీ టిప్పర్లు తిరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు.
కాంట్రాక్టర్‌కు కూటమి నేతల అండ
పూడూరు గ్రామానికి వెళ్లే రహదారి 2009 వరదల సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో తాత్కాలికంగా రోడ్డు వేసి వదిలేశారు. 2014–19 వరకు అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వం రోడ్డు వేయిస్తామని మాయ మాటలతో మోసం చేసింది. గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయడంతో 2024లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.11.84 కోట్లతో కర్నూలు–గుంటూరు ప్రధాన రోడ్డు నుంచి పడిదెంపాడు గ్రామం మీదుగా పూడురు నుంచి కోళ్లబాపురం వరకు దాదాపు 15 కి.మీ బీటీ రోడ్డును వేయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలు–గుంటూరు రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పేరిట పూడూరు సమీపంలోని ఎర్రమట్టిని భారీ టిప్పర్లలో తరలిస్తుండడంతో అక్కడక్కడ రోడ్డు కంకర తెలుతుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆందోళనలు చేపట్టి టిప్పర్లను అడ్డుకున్నారు. అయితే కాంట్రాక్టర్‌కు కూట మి నేతలు అండగా నిలవడంతో టిప్పర్లు పదేపదే ఈ రోడ్డులో తిరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. అయితే రోడ్డును కాపాడుకునేందుకు కలసికట్టుగా పోరాటం సాగిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.
మా రోడ్డుపై టిప్పర్లు తిప్పితే ఊరుకోం


