మెసేజ్‌లు వచ్చినా పత్తి కొనుగోలు చేయరా?
● సీసీఐ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడులోని పత్తి మిల్లు వద్ద సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. సీసీఐ ద్వారా పత్తిని అమ్ముకునేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీగా రైతులు పత్తి దిగుబడితో మిల్లు వద్దకు చేరుకున్నారు. సీసీఐ ద్వారా అమ్ముకునేందుకు రైతులు పంట నమోదుతో పాటు, కిసాన్ యాప్‌లో సోమవారం అమ్ముకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. దిగుబడిని మిల్లు వద్దకు తీసుకెళ్లగా.. సీసీఐ కేంద్రం అధికారులు తమకు మెసేజ్ రాలేదంటూ కొనుగోలుకు నిరాకరించారు. పత్తిని వెనక్కి తీసుకెళ్తే తమకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయంటూ ఆగ్రహించిన రైతులు మిల్లు ఎదుట నిరసన చేపట్టారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు రైతుల సమస్యను తెలుసుకుని సీసీఐ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఏ.సిరితో మాట్లాడారు. సాంకేతిక సమస్య వల్ల పరిస్థితి తలెత్తిందని, స్లాట్ బుక్ చేసుకుని మెసేజ్‌లు వచ్చిన రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో మిల్లు కేంద్రం అధికారులు పత్తిని కొనుగోలు చేశారు.
కొనుగోలు కేంద్రం సందర్శన..
కాగా రైతుల ఆందోళన, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి సోమవారం సాయంత్రం పెంచికలపాడు వద్దనున్న మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఇకనుంచి పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు, సజావుగా కొనుగోలు చేయాలని సూచించారు.


