ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
భూమా కిషోర్‌రెడ్డి
ఆళ్లగడ్డ: అభివృద్ధిని గాలికొదిలేసిన కూటమి నేతలు అక్రమార్జనకు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పారీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు గగ్గోలు పడుతున్నా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చెప్పారని, అయితే సుమారు 10 రోజులు కావస్తున్నా కనీసం ఒక్క కేంద్రమైనా ఎందుకు ఏర్పాటు చేయలేదో వెంటనే రైతులకు చెప్పాలన్నారు. కూటమి నేతల కల్తీ మద్యం దందాను నిలదీసిన వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అక్రమ అరెస్ట్‌ను ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాశిబుగ్గ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృత్యువాత పడిన విషయాన్ని డైవర్షన్ చేయడానికి కూటమి ప్రభుత్వం జోగిరమేష్‌ను అక్రమ అరెస్ట్ యడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామంటూ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిందే తడువుగా ఇసుక దందా కొనసాగిస్తున్నారన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్ రూ. 7 వేలకే అమ్ముతున్నామంటూ బహిరంగంగా ప్రెస్‌మీట్ చెబుతున్నారంటే ఎంతకు బరితెగించారో గమనించాలన్నారు. ఇసుక ఉచితమే...లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లించమంటున్నామంటూ కబుర్లు చెబుతూ ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారన్నారని విమర్శించారు.


