ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలపై ‘కూటమి’ కక్ష
● కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు(సెంట్రల్): బ్యాక్ ఎండ్ సబ్సిడీ కింద వివిధ పథకాల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాము రాణించామని, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదని ఎస్సీ, ఎస్టీ ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్ మౌలాలి, త్రిమూర్తులు, దస్తగిరి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.500 కోట్ల సబ్సిడీలు విడుదల కావాల్సి ఉందన్నారు. అయితే 20 శాతం మేరకు ఇస్తామని, మిగతా వాటిని ఇవ్వలేమని చెప్పడం అన్యాయమన్నారు. నూరు శాతం సబ్సిడీ రుణాన్ని ఇవ్వకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరించారు. జేఏసీ నాయకులు సుందర్, రాజేష్, రాజ్‌కుమార్, శివమాధవ్, చెన్నకేశవులు, రామకృష్ణ, రాజశేఖర్, దస్తగిరి, శివరామ్, సుబ్బరాయుడు, సుదర్శనం, దిలిప్, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


