 
															అత్యాశతో అవినీతికి పాల్పడరాదు
● డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ 
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగులు అత్యాశతో అవినీతికి పాల్పడి ఉద్యోగ ధర్మానికి అన్యా యం చేయరాదని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సూచించారు. ఆత్మసాక్షితో విధులను నిర్వహించి పేదలకు సేవ చేయాలని, అప్పుడు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2025 కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడారు. ఈనెల 31న దేశ తొలి ఉప ముఖ్యమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అవినీతి నివారణపై ప్రజ లు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నవంబర్ 2 వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఎంతో కష్టపడి చదివి లక్షల మందితో పోటీ పడి సాధించిన ఉద్యోగాన్ని పది మంది మంచి కోసం వినియోగించాలన్నారు. ఉద్యోగ ధర్మంలో అవినీతి అక్రమాలకు పాల్పడి సమాజంలో తలదించుకుని బతికే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈ మధ్య ఉద్యోగులకు వస్తున్న ఫేక్ ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టు పేరుతో వస్తున్న వాటికి భయపడాల్సిన అవసరంలేదని, నీతి, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి దగ్గర నిబంధనల మేరకు 1000 కంటే ఎక్కువ నగదు ఉంచుకోరాదని సీసీఎల్‌ఏ రూల్స్ చెబుతున్నట్లు చెప్పారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాలను ఏటా వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమన్నారు. ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందన్నారు. వచ్చే జీతంతో ఆనందంగా జీవనం గడపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా చిన్న పిల్లల ఆరోగ్య అధికారి జఫరుల్లా, ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, రాజా ప్రభాకర్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
