టెండర్లలో పాల్గొనొద్దు
మున్సిపల్ కాంట్రాక్టర్ల వాట్సప్ గ్రూపుల్లో మంత్రి అనుచరుడి బెదిరింపు
రూ.2 కోట్ల పనులన్నీ తమ వాళ్లకే దక్కించుకునేందుకు కుట్ర
నేటితో ముగియనున్న టెండర్ల గడువు
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్‌లో టెండర్ల పనులపై అధికార పార్టీ నేతల అనుచరులు హల్‌చల్ చేస్తున్నారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు దాఖలు చేయకూడదని, తమకే పనులు కావాలంటూ బెదిరింపులు దిగే స్థాయికి చేరారు. ముక్కూమొఖం తెలియని వ్యక్తులు, కాంట్రాక్ట్ పనులు చేయని వారు, కాంట్రాక్టు లైసెన్స్ కూడా లేని వారు సైతం కార్పొరేషన్‌లో పెత్తనం చెలాయిస్తున్నారు. కేవలం వారికున్న అర్హత మంత్రికి అనుచరులుగా వ్యవహరించడమే. ఏడాది కాలంగా కర్నూలు కార్పొరేషన్‌లో వారి ఆగడా లు శృతి మించుతున్నాయి. అర్హత ఉండి నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొంటే ఏ ఒక్కరికీ అభ్యంతరం ఉండదు. కానీ అధికార పార్టీ అనే ఒకే ఒక్క అర్హతతో టెండర్ల ప్రక్రియలో చక్రం తిప్పుతున్నారు. తాజాగా కర్నూలు నగరంలో రూ.2 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఇతర మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొనకూడదంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇంత చేసి వారు ఏమైనా ఆ పనులు చేస్తారా... అంటే అదీ లేదు. కేవలం తమకు కావాల్సిన వారికి పనులు ఇప్పించుకుని 10 శాతం కమిషన్లు దండుకునేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిండికేట్ రాజకీయం..
నగరపాలక సంస్థలో ఇటీవల అభివృద్ధి పనులకు సంబంధించి సిండికేట్ రాజకీయానికి నేతల అనుచరులు తెర తీశాారు. ఏడాది కాలంగా మంత్రికి అనుచరులుగా వ్యవహరిస్తున్నా ఒకరిద్దరు మున్సిపల్ కాంట్రాక్టర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రక్రియలో ఏ మాత్రం అనుభవం లేని పాతబస్తీకి చెందిన ఈ వ్యక్తి మున్సిపల్ అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల కోసం దందా చేస్తున్నారు. పైగా టెండర్ల ప్రక్రియ పోటీ పడి దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లకు క్లాస్‌లు పీకుతున్నారు. పోటీ పడి అంచనా విలువ కన్నా లెస్‌కు పనులు దక్కించుకుంటే ఇంకేం లాభం. సిండికేట్ అవుదాం. పోటీ లేదు. గీటీ లేదు. పనులు దక్కించుకుందాం. అవసరమైతే టెండర్లను ఎక్సెస్‌కు దక్కించుకుందాం. తానే దగ్గరుండి ఇంజినీరింగ్ అధికారులతో సెటిల్ చేస్తా. వాళ్ల పర్సెంటేజీలు వాళ్లకు ఇద్దాం. అంటూ బేరసారాలు చేసేశారు. ఇక బిల్లులు రాకుంటే చెప్పండి. ఇంత పర్సెంటేజీ ఇచ్చుకుంటే సరే.. ఏ పనైనా క్లియర్ చేస్తానంటూ ఇప్పటికే హామీలు ఇచ్చాడు. తాజాగా మరోసారి టెండర్ల ప్రక్రియల ఫలానా వర్కులన్నీ తమకే కావాలంటూ ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకూడదంటూ హుకుం జారీ చేయడం, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం చర్చానీయంశంగా మారింది. ఇలా పర్సంటేజీలకు పనులు ఖరారైతే నాణ్యత పరిస్థితి ఏంటన్న అభిప్రాయాన్ని పలువురు కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. అంతా తాము నడిపిస్తాం. అంచనాలు మించి టెండర్ దాఖలు చేసినా... మైహూనా అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతనికి ఇంజినీరింగ్ విభాగంలోని ఒక అధికారి జీ హుజూరు అంటూ వత్తాసు పలకడం విశేషం. నిఘా వర్గాలు సైతం తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం కొసమెరుపు.
మున్సిపల్ కాంట్రాక్టర్ల వాట్సప్ గ్రూపుల్లో..
బిజినిపల్లె సందీప్ (మంత్రి అనుచరుడు) పేరుతో నగరపాలక టెండర్లకు సంబంధించి ఐడి : 854082 నోటీసు నెంబర్ : 15 నుండి 19 వరకు ఉన్న దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనవద్దని మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అలాగే 851330 – 17/8 నుంచి వరుసగా 17/9, 17/7 పనుల టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదని సదరు అనుచరుడు సూచించారు. కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఇతడు పాణ్యం అర్బన్ వార్డుల్లోను తమ వాళ్లకే పనులు ఇప్పించేందుకు చక్రం తిప్పడం గమనార్హం.
టెండర్లలో పాల్గొనొద్దు


